తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీలోని లీడర్లు చాలామందికి భవిష్యత్తు మీద భయం పట్టుకుంది. అందుకే పదవుల్లో ఉన్నవారే కాదు పదవులు లేనివారు కూడ మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, కొందరు నాయకులు పార్టీకి బైబై చెప్పగా ఇప్పుడు మరొక లీడర్ పార్టీని వీడాలని చూస్తున్నారట. ఆయనే విజయవాడకు చెందిన వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రంగ కుటుంబానికి విజయవాడలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి కుటుంబానికి రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు రాధాకృష్ణ. కానీ కొన్నేళ్లుగా ఆయనకు రాజకీయం కలిసిరావట్లేదు. అధికార పార్టీలో ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఏ పదవీ లేకుండా కూర్చున్నారు.
ఎన్నికలు పూర్తైనప్పటి నుండి ఆయన టీడీపీ కార్యకలాపాల్లో పెద్దగా వేలు పెట్టట్లేదు. ఆయన చూపంతా ఇప్పుడు బీజేపీ మీద ఉన్నట్టు చెబుతున్నారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం మూలాన బీజేపీ కూడ ఆయనకు సముచిత స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటికే బలమైన నాయకులను జారవిడుచుకున్న చంద్రబాబు నాయుడు రాధాను వదులుకోవాలని అనుకోవట్లేదు. అందుకే బుజ్జగింపు పర్వాలు స్టార్ట్ చేశారట. ఏవేవో చెబుతూ ఆయన మనసు మార్చాలని చూస్తున్నారట. ఇలా రాధా కోసం చంద్రబాబు కిందా మీదా పడుతుండటం అధికార పార్టీకి హాస్యాస్పదంగా ఉంది.
ఎందుకంటే గత ఎన్నికల ముందు వరకు రాధా వైసీపీలోనే ఉన్నారు. జగన్ కూడ ఆయనకు మంచి ప్రాముఖ్యత ఇచ్చేవారు. రాధా ఫాలోయింగ్ తగ్గిందని తెలిసినా అభిమానంతో గెలిపించుకుంటాననే ధీమాతో విజయవాడ ఈస్ట్ టికెట్ కేటాయించారు. కానీ రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించారు. కానీ జగన్ ఒప్పుకోలేదు. రాధాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆయన వినకుండా టీడీపీలోకి వెళ్లిపోయారు. అక్కడితో వంగవీటి కుటుంబాన్ని పక్కనపెట్టేసింది వైసీపీ. అయినా విజయవాడలో వైసీపీలో ఎలాంటి నష్టమూ జరగలేదు. పైగా రాధా వెళ్లి టీడీపీని ఆదుకున్నది ఏమీ లేదు. అలాంటి యావరేజ్ లీడర్ కోసం బాబుగారు పడుతున్న తాపత్రయం చూసి వైసీపీ నేతలు నవ్వుకుంటున్నారట.