అధికారంలోకి రాకముందు ఒకలా ఉన్న వైకాపా పరిస్థితి అధికారంలోకి వచ్చాక ఇంకోలా తయారైంది. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఏం చెబితే అది చేసిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మాత్రం హద్దులు దాటేస్తున్నారు. ఎవరికివారు వేరు వేరు దారులు వెతుక్కుంటున్నారు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో సమన్వయం లోపించింది. ప్రధాన నేతల మధ్యనే పొరపచ్చాలు మొదలయ్యాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక్క క్షణం పడట్లేదు. ఒకరి లొసుగులు ఒకరు బయటపెట్టుకుంటూ ప్రజల్లో చులకనైపోతున్నారు. మొదట్లో ఇలాంటి గొడవలు మామూలే అనే అనుకున్నా ఇప్పుడు మాత్రం చేయిదాటిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి మీదే ఎగిరిపడుతున్నారు ఎమ్మెల్యేలు. ప్రధానంగా గుంటూరు, విశాఖ జిల్లాల్లో పార్టీ దాదాపు రోడ్డు మీదకు వచ్చేసింది. నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.
ఇదంతా చూస్తున్న జనం జగన్ పార్టీని పట్టించుకోవట్లేదని, నాయకులు ఏం చేస్తున్నారో కూడ గమనించుకోలేకపోతున్నారని, ఇలాగే ఉంటే ఇంకొన్నేళ్లలో పార్టీ ముక్కలవడం ఖాయమని అనుకుంటున్నారు. అలా అనుకోవడంలో విచిత్రమేమీ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన తర్వాత జగన్ అందరితోనూ మాట్లాడింది లేదు. చూసేవారు ఎవరైనా అంత పెద్ద పార్టీని నడపడం ఆయనకు చేతకావట్లేదనే అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదట. జగన్ మౌనం వెనుక పెద్ద పన్నాగమే ఉందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. జగన్ చూసీ చూడనట్టే ఉంటున్నా అందరినీ ఒక కంట కనిపెట్టే ఉన్నారట. ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ ఆయన టేబుల్ మీదకు ఎప్పటికప్పుడు చేరుతూనే ఉన్నాయట.
జగన్ తన అనుంగ నేతలతో ఒక్కటే చెబుతున్నారట. గెలిచిన అందరికీ స్వేచ్ఛను ఇచ్చాం. ఎవ్వరి మీదా అధిష్టానం నుండి పెద్దగా ఒత్తిడి లేదు. అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదు. ఎవరి నియోజకవర్గాలను వారికి అప్పగించేశాం. ప్రజల్లోకి వెళ్లడం, పనులు చేసుకోవడం వారి బాధ్యత. అలా చేసినవారికే మంచి పేరు ఉంటుంది. అలాంటివారే పదవుల్లో ఉంటారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడ అలాంటివారికేనని, ఎప్పటికప్పుడు నాయకుల పనితీరును సమీక్షిస్తూ వెళ్తున్నట్టు చెప్పేశారట. దీన్నిబట్టి జగన్ ఒక పక్కా ప్లానింగ్ చేసుకుని ముందుకువెళుతున్నట్టు అర్థమవుతోంది. నాయకులను ఊరికే వదిలేయలేదని, ప్రతిఒక్కరి మీదా నిఘా పెట్టారని తెలుస్తోంది.
ఇంకొన్ని నెలల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అందులోనే జగన్ చేసిన ప్లానింగ్ తాలూకు ఎఫెక్ట్ కనబడిపోతుంది. ఈ రెండున్నరేళ్లలో ఇబ్బందులు లేకుండా తమ పని తాము చేసుకుంటూ జనంతో మమేకమైన వారినే పదవుల్లో ఉంచి ఎక్కువ తక్కువలు చేసినవారిని పక్కనపెట్టేసి, వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్ఛే ఛాన్స్ ఉంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడ ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల ఆధారంగానే కేటాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఎంతటివారైనా సరే తోక జాడిస్తే కట్ చేసి పడేయడం పక్కా అన్నమాట.