ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇతని పేరునే జపం చేస్తున్నాయి రాజకీయ పార్టీలో. బీజేపీ, ఆమ్ ఆద్మీ, వైసీపీలను అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్రధారి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా పొలిటికల్ పార్టీలు ఆయన్ను బుక్ చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఈయన ఐప్యాక్ టీమ్ తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే స్టాలిన్ తరపున పనిచేసున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేసి స్టాలిన్ చేతిలో పెట్టిన ఆయన గెలుపు తథ్యం అనే మాటిచ్చారట. అయితే ప్రశాంత్ కిశోర్ రచించిన పొలిటికల్ వ్యూహాలు ఊహలకు మించి పనిచేసింది మాత్రం వైసీపీ విషయంలోనే. గెలుపు మీద ధీమా ఉన్నప్పటికీ 151 స్థానాల్లో గెలుపు అనేది జగన్ సైతం ఊహించని పరిణామం. అదంతా ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ స్ట్రాటజీల మహిమే అనేది వైసీపీలో సైతం ఉన్న టాక్.
అందుకే జగన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రశాంత్ కిశోర్ సహాయం తీసుకోవాలని నిర్ణయించేసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలేవీ జరగట్లేదు. కానీ స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని జెడ్పిటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ మిగిలిన వాటిలో కూడ మెజారిటీ స్థానాలు సాధించడం ఖాయం. అయితే త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం ఢిల్లీ స్థాయిలో నడుస్తోంది. 2022లోనే ఎన్నికలు జరగవచ్చని అంటున్నారు. అందుకే జగన్ నుండి ప్రశాంత్ కిశోర్ కు ఇన్విటేషన్ వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. జమిలి ఎన్నికలు వచ్చే లోపు ప్రజల్లో పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకోవాలని జగన్ భావిస్తున్నారట.
అందుకే ఐప్యాక్ టీమ్ ద్వారా గత ఎన్నికలప్పటి పరిస్థితిని ఇప్పటి పరిస్థితిని పోల్చి చూసుకుని ప్రజల్లో ఆదరణ పెరిగిందా తగ్గిందా అనే అంచనాకు రావాలని తద్వారా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే ఇప్పటి నుండే తీసుకోవాలని భావిస్తున్నారట. ఈమధ్య ప్రతిపక్షాలు కూడ కొద్దిగా పుంజుకున్నాయి. ప్రజలు వారి మాటలను కూడ వింటున్నారు. కొన్ని వర్గాల్లో ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తి సంకేతాలు కూడ ఉన్నాయి. అందుకే జగన్ ప్రశాంత్ కిశోర్ బృందాన్ని దింపి క్షేత్ర స్థాయిలో స్థితిగతులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవడం కూడ మంచిదే.