ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉప ఎన్నికలను పెద్దగా పట్టించుకోనట్టే కనబడుతున్నా చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం చేసేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థిగా ఒక వైద్యుడిని ఖరారు చేసిన ఆయన గెలుపు కోసం పక్కా పథక రచన చేస్తున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. పైగా అది సిట్టింగ్ స్థానం కూడ. కనుక గెలుపు అవకాశాలు వైసీపీకే ఎక్కువ. అలాగని ఉదాసీనంగా వ్యహరిస్తే మాత్రం ఉపద్రవం తప్పదు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలే అందుకు నిదర్శనం. సిట్టింగ్ స్థానమే అయినా హరీష్ రావు బాధ్యతలు తీసుకున్నా తెరాస ఓడిపోయింది. ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఇప్పటికీ తేలలేదు. అందుకే తిరుపతి విషయంలో అలాంటి సీన్ రిపీట్ కాకూడదనేది జగన్ భావన.
అలాగని తానే రంగంలోకి దిగి పనులు చూసుకోలేరు. కాబట్టే సమర్ధుడైన నేత కోసం వెతుకుతున్నారు. ఎవరి భుజాల మీద బాద్యత పెడితే నిశ్చింతగా ఉండగలనో చూసుకుంటున్నారు. ఈ ప్రకారం జగన్ మనసులో ఇద్దరు లీడర్లు ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాగాఇంకొకరు వైవీ సుబ్బారెడ్డి. ప్రథమంగా జగన్ ఆలోచనలో ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. రాయలసీమ జిల్లాల్లో అందునా చిత్తూరులో పెద్దిరెడ్డి ప్రభావం చాలా ఎక్కువ. చిత్తూరు ఆయన సొంత జిల్లా. చంద్రబాబు కూడ చిత్తూరు జిల్లాకు చెందినవారే. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నారు, అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించి కలిస్ వచ్చే శక్తులను కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఆయన్ను ఢీకొట్టాలంటే పెద్దిరెడ్డి మాత్రమే బెటర్ ఆప్షన్.
కానీ ఇక్కడ ఒక చిక్కుంది. ఈమధ్య పార్టీలో పెద్దిరెడ్డికి వ్యతిరేక వర్గం ఒకటి తయారైంది. జిల్లా రాజకీయాల్లో ఆయన చెప్పిందే వేదంగా ఉండటం, పనులు జరగకపోవడంతో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు, ఈ విషయం జగన్ కు బాగా తెలుసు. బయటకు చెప్పే ధైర్యం చేయకపోయినా అవకాశం దొరికితే అందరికీ తమ బాధ తెలిసేలా చేయాలనే భావనలో ఉన్నారు. వారికి ఈ ఉప ఎన్నిక మంచి అవకాశం కావొచ్చు. పార్టీ గెలుపు కోసం పనిచేయకపోగా పరోక్షంగా వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తే గెలిచినా భారీ మెజారిటీ రాక నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టే పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించే విషయంలో కొద్దిగా సందేహపడుతున్నారట జగన్.
ఇక వైవీ సుబ్బారెడ్డి విషయానికొస్తే ఆయన సీమ వ్యక్తి కాకపోయినా టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నారు. జిల్లా నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన మీద ఎవ్వరికీ వ్యతిరేకత లేదు. ఆయనకు బాధ్యత ఇస్తే ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అందరూ కలిసివస్తారు. కానీ చంద్రబాబు, బీజేపీ వ్యూహాలను ఆయన ఏమాత్రం తట్టుకోగలరు అనేదే డౌట్. అందుకే బాధ్యతలు బాబాయికా,పెద్దిరెడ్డికా అనే మీమాంస కొసాగుతోంది ముఖ్యమంత్రిలో. చూడాలి చివరకు ఆయన ఎవరిని ఎంచుకుంటారో.