అమరావతి: శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోయారు. అధికార పక్షంవైపు వేలు చూపిస్తూ వాగ్యుద్దానికి దిగారు. టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిమ్మల రామానాయుడికి మాట్లాడే అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా టీడీపీ సభ్యులు గలాటా సృష్టించడంపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. తన తప్పులను కప్పిపుచ్చకునేందుకు చంద్రబాబు సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి’ మాట్లాడుతూ… నివర్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించలేదని అన్నారు. కరోనాకు భయపడి ‘చంద్రబాబు’ హైదరాబాద్‌లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాత్రం ఎల్లో మీడియా కవరేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. “సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు” అని విమర్శించారు. సభలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో అర్థం కావడం లేదని అన్నారు. తాను అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ ఆయన వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం.. చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభా సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారానికి వాయిదా వేశారు.