జైలుకెళ్లి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు పరిస్థితి అద్వానమైపోయింది. అధికార పార్టీ నేతల చేతిలో రకరకాల అవమానాలకు గురవుతున్నారు ఆయన. ఇంతకుముందు అధికారం లేకపోయినా నోటి దూకుడుతో నెట్టుకు వచ్చిన ఆయన ఇప్పుడు నోరు కూడ తెరవకపోవడంతో మరీ అలుసైపోయారు. అధికారం అంటే ఎలాగూ చేతిలో ఉండదు కాబట్టి కనీసం అధికారులతో అడపాదడపా మాట్లాడుతూ ఉనికి చాటుకునే ప్రయత్నమైనా చేసేవారు. ఇప్పుడు మాత్రం వైసీపీ టెక్కలి ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుతో అచ్చెన్నాయుడు చేతికి పూర్తిగా బంధాలు పడిపోయాయి. ఎమ్మెల్యే అచ్చేన్నే అయినా అన్నీ తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారు దువ్వాడ.
అచ్చెన్నాయుడు జైల్లో ఉన్న 80 రోజులు టెక్కలిలో ఓ స్థాయిలో హవా నడిపి పట్టు పెంచుకున్న దువ్వాడ అచ్చెన్నాయుడు జైలు నుండి బయటికొచ్చి నియోజకవర్గంలోనే కూర్చున్నా స్పీడు తగ్గించలేదు సరికదా ఇంకాస్త పెంచారు. మొన్నామధ్యన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యవసాయ అధికారులతో నిమ్మాడలో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షకు అధికారులు కొందరు హాజరయ్యారు. దాంతో దువ్వాడ ఆ అధికారులను ఇంటికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. గతంలో తమ ఎమ్మెల్యేలను టీడీపీ అధికారంలో ఉండగా తీవ్ర అవమానాలకు గురిచేసిందని, అలాంటిది ఇప్పుడు వారినెందుకు లెక్కచేయాలని, ప్రభుత్వంలో తాము ఉంటే ప్రతిపక్ష నేత వద్దకు ఎందుకు వెళుతున్నారు అంటూ మండిపడ్డారు.
అంతేకాదు అధికారుల మీద మండిపడటం అనేది ఘనకార్యం అనే రీతిలో సోషల్ మీడియాలో పెట్టారు. ఇక తాజాగా జగనన్న విద్యాకానుక ముగింపు సభను నియోజకవర్గంలో ఎక్కడైనా పెట్టుకునే వీడలుండగా దువ్వాడ పట్టుబట్టి మరీ అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో భారీ బహిరంగ సభ పెట్టి, వేలమందితో ర్యాలీ చేయించి తనకు తిరుగులేదని, ఇక ఆటలు సాగవని, తరతరాల కింజరపు కుటుంబ ఆధిపత్యానికి తేరా పడిందని సంకేతమిచ్చారు. పైగా దువ్వాడకు హైకమాండ్ నుండి పూర్తిస్థాయి సపోర్ట్ ఇస్తున్నారు. అసలు ఆయన వ్యవహారశైలి చూస్తే జగనే నేరుగా నేనున్నా నీకేల భయం అంటూ అభయమిచ్చినట్టు అనిపిస్తోంది.