జగన్ పై దాడి… కుసంస్కారుల కూతలకు నెటిజన్ల వాతలు!

“మేమంతా సిద్ధం” అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌ కు చేరుకోగానే ఒక ఆగంతకుడు దాడి చేశాడు! సీఎం జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువు విసరడంతో… ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు.

ఈ సమయంలో గాయం కాస్త బలంగా తగలడంతో రక్తం కారుతున్నా.. బాధను పంటి బిగువన భరిస్తూనే జగన్‌ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్‌ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్‌ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. ఈ సమయంలో ఆ వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కు కూడా తగలడంతో ఆయనకుకు గాయమైంది.

కట్ చేస్తే… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి జరగడంతో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, మమతా బెనర్జీ, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ తో పాటు పలువురు నేతలు స్పందించారు. తమదైన శైలిలో విచారం వ్యక్తం చేస్తూ రియాక్ట్ అయ్యారు! ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించారు.. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని.. వీటిని పిరికిబంద చర్యలుగా అభివర్ణించారు.

ఆ సంగతి అలా ఉంటే… జగన్ పై దాడి జరిగిన తర్వాత మీడియా ముసుగులో కరపత్రాలు అచ్చేసి పంచే వాటిగా పేరు సంపాదించుకున్నారని చెప్పే ఒక వర్గం మీడియా… సానుభూతి చూపించలేదు, ఖండించినట్లు కనిపించలేదు సరికదా… ఇది వైసీపీ ప్లాన్ అని ఒకరంటే.. సెక్యూరిటీ లోపం అని మరొకరు సైడ్ చేసే ప్రయత్నం చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా… అది పెద్ద దాడేమీ కాదు.. జస్ట్ రెండే కుట్లు పడ్డాయని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం!

ఇక ఇదేదో అనుమానంగా ఉంది.. ఇదంతా ఒక ప్లాన్, జగన్ ఆంధ్రా కమలాసన్ అంటూ నిస్సుగ్గు వ్యాఖ్యలు, కుసంస్కారపు కూతలు కూడా పలువురు కూసారనే కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఎవరూ ప్రోత్సహించకూడదు. సాటి మనిషిగా గాయపడిన వ్యక్తికి సానుభూతి చూపించాలి. అలా కాకుండా… వారి వారి కుసంస్కారాలను, వారిలోని రాక్షసత్వపు తాలూకు లక్షణాలను బయట పెట్టారంటూ తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు వైసీపీ నేతలు!

గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడిన జగన్… ఇప్పుడు విజయవాడ రాయి డ్రామాకు తెరలేపారని నిస్సుగ్గు కూతలు కూడా పలువురు ఆన్ లైన్ వేదికగా కూసారని వైసీపీ శ్రేణులు ఫైరవుతున్నారు. జగన్ పై విసిరిన ఈ రాయి.. టీడీపీ సమాదికి పునాదిరాయి అంటూ నిప్పులు కక్కుతున్నారు! ఏది ఏమైనా… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే స్పందించే విధానం ఇది కాదని.. ఆ కుసంస్కారులకు ఆన్ లైన్ వేదికగా వాతలు పెడుతున్నారట నెటిజన్లు!