ఒకవైపు జగన్ పార్టీని పైకి తీసుకురావడానికి, మరింత బలోపేతం చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడ ఏదో రకంగా నానా అవస్థలుపడి వేల కోట్లతో పథకాలు అమలుచేస్తున్నారు. జనం సైతం జగన్ సంక్షేమకర పాలనను అభినందిస్తున్నారు. అతి సున్నితమైన వాతావరణంలో కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు ఆయన. అది కూడ చాలా కష్టమైనా పనే. మరోవైపు ప్రతిపక్షాల దాడులను కూడ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండాలి. ఆ తిప్పికొట్టడం మాటల్తో కాదు చేతల్తోనే చేయాలి. అదీ చేసున్నారు ఆయన. ఇక పార్టీలోని అంతర్గత కలహాల సంగతి చెప్పనక్కర్లేదు. రోజుకొక చోట వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. వాటిని చల్లార్చడం పెద్ద కష్టం. ఇన్ని విధాలుగా పార్టీ కోసం జగన్ కష్టపడుతుంటే కొందరు నేతలు తీరు పార్టీ పరువును తీస్తోంది.
వర్గపోరుతో కొందరు బయటికొచ్చి పరస్పరం దాడులకు దిగుతున్నారు. ఒకరి లొసుగులను ఒకరు బయటపెట్టుకుంటూ పార్టీ జనంలో చులకనవుతున్నారు. గుంటూరు జిల్లా, ప్రకాశం, విజయవాడ, విశాఖ జిల్లాల్లో నేతల మధ్యన జరుగుతున్న గోడవలు చూస్తున్న జనం పార్టీని వీళ్లే ఓడించేలా ఉన్నారు అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇవి చాలవన్నట్టు కొందరు నేతల మీద క్రిమినల్ ఆరోపణలు వస్తుండటం పెను దుమారాన్ని రేపుతోంది. ఇటీవలే తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి జేసీ ఇంటికి వెళ్లి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ప్రధానంగా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమీషనర్ రాధల పేర్లు వినబడ్డాయి. వాళ్ళే తన భర్తను హత్యచేశారని సుబ్బయ్య సతీమణి మొదటి నుండి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
రెండు రోజుల క్రితం నారా లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యే మీద, ఆయన బావమరిది మీద, మున్సిపల్ కమీషనర్ మీద కేసు తీసుకుంటేనే వెనక్కుతగ్గుతామని నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారి ముగ్గురు పేర్లను అనుమానితుల జాబితాలోకి చేరుస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు ఆ హత్య చేసింది వైసీపీ ఎమ్మెల్యేనే అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు బయటికొచ్చి హత్యకు తనకు సంబంధం లేదని ప్రమాణం చేసినా నమ్మే పరిస్థితి లేదు. ఒకరకంగా ఈ హత్యతో రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ మొదలయ్యాయని విస్తున్నారు జనం. ఈ కేసులో గనుక ఎమ్మెల్యేదే ప్రధాన హస్తమని తేలితే మాత్రం అధికార పార్టీ తీవ్రస్థాయిలో దెబ్బతినాల్సి ఉంటుంది. అందుకే జగన్ ఆరోపణలు వస్తున్న ఎమ్మెల్యే మీద గట్టి నిఘా పెట్టారట. ఎమ్మెల్యే గురించి ఇంచు ఇంచు పరోశోధించి నివేదిక తెప్పించుకునే పనిలో ఉన్నారట. ఆ నివేదికను బట్టే సదరు ఎమ్మెల్యే పట్ల జగన్ స్పందన ఆధారాపడి ఉంటుంది.