“భారీ” స్కెచ్… తన బలాన్ని కాపాడుకునే పనిలో జగన్!

రాష్ట్రంలో వైఎస్ జగన్ బలం, బలంగంలో మెజారిటీ ఎస్సీ ఓటు బ్యాంక్ అనేది తెలిసిన విషయమే. అప్పట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తీసుకువ‌చ్చిన ప‌థ‌కాలు, తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎస్సీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ కు అనుకూలంగా మారింది. అనంతరం చంద్రబాబు చెప్పిన మాటలు, చేసిన పనుల వల్ల అది మెజారిటీ శాతం వైసీపీకి మ‌ళ్లింది! ఈ సమయంలో ఆ ఓటు బ్యాంక్ ను మరింతగా పదిలం చేసుకునే దిశగా జగన్ మరో అడుగు ముందుకేస్తున్నారు.

అవును… జగన్ కు బలంగా మారిన ఎస్సీ ఓటు బ్యాంక్ వల్ల ఆ రిజర్వ్డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మెజారిటీ స్థానాల‌ను వైసీపీ నెగ్గుతూ వ‌స్తోంది. ఇందులో భాగంగానే 2019లో భారీ సంఖ్యలో ఎస్సీ నియోజ‌క‌వర్గాల్లో వైసీపీ పాగా వేసింది. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లోనూ మెజారిటీ ఎస్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో జగన్ ఒక భారీ స్కెచ్ వేశారు.

ఇందులో భాగంగా… రాజ్యాంగ నిర్మాత‌, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని దేశ‌లోనే ఎక్కడా లేనంత ఎత్తులో విజ‌య‌వాడ‌లో నిర్మించారు. దీనిని ఈ నెలలోనే జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. వాస్త‌వానికి 2014 ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేడ్కర్ స్మృతి వ‌నం పేరుతో అమ‌రావ‌తిలో ఏర్పాట్లు చేసింది. కానీ ఇది కార్య రూపం దాల్చలేదు!

అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన అనంతరం కోవిడ్ సమస్యలనుంచి గట్టేక్కిన తర్వాత జగన్ ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా… అమ‌రావ‌తిలో కాకుండా విజ‌య‌వాడ కేంద్రంగా న‌డిబొడ్డున ఉన్న పీడ‌బ్ల్యూడి గ్రౌండ్స్‌ లోనే అంబేడ్కర్ విగ్రహానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ భారీ విగ్రహంతోపాటు స్మృతి వ‌నం, లైబ్రరీ, ఆట‌స్థలం స‌హా ఇత‌ర సౌక‌ర్యాలు కూడా క‌ల్పించారు.

ఈ సమయంలో ఆదివారం నుంచి ఎస్సీలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోని గ్రామాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేప‌ట్టనున్నారు. ఇదే సమయంలో… అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంట‌రీని ప్రద‌ర్శించ‌నున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ సీఎం జ‌గ‌న్.. ఎస్సీలకోసం చేసిన ప్రయ‌త్నాలను వివ‌రించనున్నారు.

అనంతరం దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది!