కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఏపీలో రక్షణ చర్యగా మే నెల 5 నుండి రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూని విధించింది. వైరస్ కేసులు తగ్గుతూ పరిస్థితులు మెరుగవుతున్నప్పటికీ మరికొన్నాళ్లు కర్ఫ్యూ కొనసాగించటమే ఉత్తమమని కొన్ని సడలింపులనిచ్చి ఈ నెల 19 వరకు పొడగించటం జరిగింది. అయితే తాజాగా సీఎం జగన్ కర్ఫ్యూ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన స్పందన సమీక్ష సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ… జూన్ 20 నుండి కొన్ని సడలింపులు ఇస్తూ కర్ఫ్యూను మరికొన్ని రోజులు కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ఇప్పట్లో పూర్తిగా మాత్రం అంతం కాదని స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడుతూ కోవిడ్ నిబంధలని అనుసరించాలని సూచించారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా జరగటానికి వ్యాక్సిన్ కొరతనే కారణమని… అధిక మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి జరగాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికి వ్యాక్సిన్ అందజేయాలని, ఈ పక్రియ అంతా పార్దర్శకంగా జరగాలని ఆయన సూచించారు. కోవిడ్ నియంత్రణలో కలెక్టర్లు చాలా అద్భుతంగా పనిచేశారని వారిని సీఎం ప్రశంసించారు. కోవిడ్ ట్రీట్‌మెంట్ ను అర్హత ఉన్నవారందరూ ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా పొందారని, ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించారని ఆయన అభినందించారు.
అనుకుంటున్నట్లుగా థర్డ్‌వేవ్ ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ నెల 22న “వైఎస్సార్ చేయూత” పధకాన్ని అమలు చేయబోతున్నట్లుగా దాని కోసం అధికారులు సిద్దం కావాలని ఆదేశించారు. అదేవిధంగా జూలై 1న వైఎస్సార్ బీమా పధకం, అదే నెలలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు కూడా అమలు చేయనున్నట్లు జగన్ పేర్కొన్నారు.