ఈమధ్య అధికార పార్టీకి ఒక విచిత్రమైన సమస్య తలెత్తింది. అదే కోవర్టులు సమస్య. బయటి నుండి ఎన్ని సమస్యలు ఎదురైనా ధీటుగా ఎదుర్కునే సత్తా జగన్ కు ఉంది. కానీ కనబడని ఈ కోవర్టుల వలన తెలియకుండానే సమస్యల్లో చిక్కుకుంటున్నారు ఆయన. ఈ కోవర్టుల్లో కొందరు వైసీపీ నేతలు, ఇంకొందరు టీడీపీ నుండి ఈమధ్యే పార్టీలో చేరిన నేతలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు పార్టీలో అంతర్గతంగా జగన్ ఏం చేసినా బయటకు పొక్కుతూ వచ్చింది. సన్నిహిత నేతల వద్ద జగన్ చేసిన మంతనాలు కూడ లీకైపోయేవి. దీంతో ప్రతిపక్షం జగన్ నిర్ణయాలు అమలు కాకముందే వాటి మీద విమర్శలు లేవనెత్తి అడ్డుపడుతూ వచ్చారు. ఇది ప్రభుత్వానికి పెద్ద అడ్డంకిలా తయారైంది.
ప్రధానంగా కోర్టుల విషయంలో జగన్ తీసుకోబోయే ముందస్తు చర్యలు పార్టీలోని లీడర్ల కంటే ముందే ప్రతిపక్షానికి తెలిసిపోయేవి. ఫలితంగా టీడీపీ వ్యాజ్యాలను సిద్ధం చేసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కోర్టుల్లో సవాల్ చేస్తూ వచ్చింది. పైపెచ్చు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులన్నిటినీ చంద్రబాబు తన పోరాట ఫలితమే అంటూ ప్రొజెక్ట్ చేసుకోవడంతో ఆయన మీద జనంలో ఒకింత సాఫ్ట్ కార్నర్ కూడ ఏర్పడింది. అత్యంత గోప్యంగా ఉండాల్సిన జగన్ ఢిల్లీ టూర్ వివరాలు కూడ బయటికొచ్చాయి అంటే ఇది కోవర్టులు పని కాకపోతే మరేమిటి. ఇదే అనుమానం జగన్ కు కూడ వచ్చిందట.
అందుకే పక్కా నిఘా పెట్టి వారిని పట్టుకునే ఏర్పాట్లు చేశారట. తనకు అత్యంత నమ్మకస్తులైన నాయకులకు జగన్ ఈ ఆపరేషన్ అప్పజెప్పడం వారు రహస్యంగా అందరి మీదా ఒక కన్నువేసి ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగిపోయాయట. ఈ ఇన్వెస్టిగేషన్లో మొత్తం పది మంది వరకు రౌండప్ చేశారట. వీరే లీకు వీరులని జగన్ ముందు నివేదిక పెట్టారట నేతలు. ఇక మిగిలిందిల్లా జగన్ రంగంలోకి దిగి తుది నిర్ణయం తీసుకోవడమే అంటున్నారు. మరి జగన్ ఆ కోవర్టులకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా లేకపోతే కనికరం లేకుండా బయటకు పంపేస్తారా లేకపోతే ఎన్నికల టైంలో టికెట్ల కేటాయింపులో తన కోపాన్ని ప్రదర్శిస్తారా అనేది చూడాలి.