కొత్త డిస్కషన్… కేసీఆర్ చేసిన సాహసం జగన్ చేయలేరా?

ప్రస్తుతం ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అనంతరం వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా అది రెండు రాష్ట్రాలకూ సంబంధించిన విషయంగానే ఇరురాష్ట్రాల ప్రజలు భావిస్తారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల అనంతరం… కేసీఅర్ – జగన్ దోస్తులనే విషయంపై తెగ చర్చ నడిచింది.

ఇదే సమయంలో ఇద్దరి నేతల తీరు కొన్ని విషయాల్లో చాలా దగ్గరగా ఉంటుందని అంటుంటారు. నేతలను రెగ్యులర్ గా కలిసే విషయంలోనే కానీ.. క్విక్ డెసిషన్స్ తీసుకునే విషయంలోకానీ పోలీకలున్నాయని చెబుతారు. ఇదే సమయంలో ఇద్దరు మొండి ఘటాలనే కామ్మెంట్లూ రాజకీయవర్గాల్లో వినిపిస్తుంటాయి. అయితే… తాజాగా జరిగిన ఒక విషయంలో కేసీఆర్ చేసినంత ధైర్యం జగన్ చేయలేరని అంటున్నారు పరిశీలకులు.

అదేమిటంటే… సిట్టింగులకే సీట్లు అనే విషయం! అవును… ఎన్నికల విషయంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సాహసం చేశారనే అంటున్నారు పరిశీలకులు. మూడోసారి గెలవాలంటే ఆషామాషీ కాదని తెలిసినప్పటికీ… కొన్ని విమర్శలు వచ్చినా కూడా మెజారిటీగా సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వడాన్ని సాహసమైన చర్యగా చెబుతున్నారు. పైగా సిట్టింగుల్లో చాలా మంది దళిత బందులో కమిషన్లు కొట్టేస్తున్నారని నేరుగా కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు కూడా!

అయినప్పటికీ నలుగురైదుగురు మినహాయిస్తే సుమారు 97 – 98 శాతం మంది సిట్టింగ్‌ లకు టిక్కెట్లు ఇవ్వడమంటే ఆషామాషీ విషయం కాదు. పైగా ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం కేసీఆర్ కి తెలియంది కాదని అంటున్నారు! అయినప్పటికీ సిట్టింగ్‌ లకు సీట్లిచ్చిన కేసీఆర్… అభ్యర్థి ఎవరైనా తన బొమ్మే గెలిపించేస్తుందనే నమ్మకంతో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు!

ఆ సంగతి అలా ఉంటే… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లు ఇచ్చే విషయంలో జగన్ మాత్రం అంత సాహసం చేయరని తెలుస్తుంది. ప్రభుత్వంపై సహజంగా వ్యతిరేకత ఉందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… వ్యక్తిగతంగా వ్యతిరేకత సంపాదించుకున్న ఎమ్మెల్యేలకు మాత్రం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే పార్టీ సమావేశంలో ఓపెన్ గా చెప్పారు!

వాస్తవానికి 2014, 2019 ఎన్నికల్లోనూ జగన్ తన కష్టంతోనే ఎన్నికలకు వెళ్లారు. ఆల్ మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ ఫోటోనే కీ ప్రమోషన్! అయినప్పటికీ ఈసారి మాత్రం సిట్టింగ్‌ లలో సుమారు ముప్పయి నుంచి నలభై మందికి సీట్లు దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. దీంతో… సిట్టింగులకు సీట్లు కేటాయించే విషయంలో జగన్ కంటే కేసీఆర్ కే ధైర్యం ఎక్కువ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!