వివేకా హత్యకేసులో ఏ8 గా అవినాష్… జగన్ పేరు ప్రస్థావించిన సీబీఐ!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక హాట్ టాపిక్ గా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో తాజాగా రెండు కీలక అప్ డేట్ లు తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురించి కాగా.. మరొకటి ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌ గురించిన వ్యవహారం.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు భాస్కర్‌ రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన కౌంటర్‌ లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిల ప్రమేయం ఉందని సీబీఐ చెప్పింది. ఇదే సమయంలో దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీ కొడుకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేసిది.

అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే ఆయన బలానికి నిదర్శనం అని గుర్తుచేసిన సీబీఐ… భాస్కర్‌ రెడ్డికి బెయిల్‌ ఇచ్చేసిన తర్వాత ఎన్ని షరతులు పెట్టినా ప్రయోజనం లేదని సీబీఐ స్పష్టం చేసింది! దీంతో… భాస్కర్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది.

ఇదే క్రమంలో… వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని ఈ కేసులో సీబీఐ ఎనిమిదో నిందితుడు (ఏ8) గా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్‌ లో అవినాష్‌ రెడ్డిని సహనిందితుడిగా మాత్రమే పేర్కొన్న సీబీఐ…. తాజాగా దాఖలు చేసిన కౌంటర్‌ లో మాత్రం ఏ8గా ప్రస్తావించింది. వివేకా హత్యకు కుట్ర చేయడం, హత్య అనంతరం సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి ప్రమేయం ఉందని.. దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీబీఐ సంచలన విషయాలు తెలిపింది.

ఈ సందర్భంగా మరిన్ని కీలక విషయాలు వెళ్లడించిన సీబీఐ అధికారులు… శివశంకర్‌ రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌ రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని.. కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్‌, శివశంకర్‌ రెడ్డి చెప్పారని.. ఈ క్రమంలో సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం కూడా అవినాష్ చేశారని సీబీఐ పేర్కొంది!

ఇదే సమయంలో జగన్ ప్రస్థావన కూడా తీసుకొచ్చింది సీబీఐ. వివేకా హత్య విషయం సీఎం జగన్‌ కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ పునరుద్ఘాటించింది. ఇక వివేకా పీఏ బయటకు చెప్పకముందే ఈ హత్య వ్యవహారం జగన్ కు తెలుసని, ఆ విషయాన్ని తాము దర్యాప్తులో గుర్తించామని సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.