దీన్ని గైర్హాజర్ అంటారు… అవినాష్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సమయంలోనూ.. ముఖ్యంగా అవినాష్ రెడ్డి విచారణ సమయంలోనూ ఒకవర్గం మీడియా చూపించిన ఉత్సాహం, అందించిన ఊహాగాణ వార్తల సమాహారం, చేసిన డిబేట్ల సంగతి అందరికీ తెలిసిందే. అవినాష్ రెడ్డి గైర్హాజరవుతున్నా కూడా సీబీఐ చేతకానట్లుగా మారిపోయిందంటూ కామెంట్లు చేశారు! అయితే తాజాగా ఆ కామెంట్లు అవినాష్ ఫ్యాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

అవును… వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో తప్పించుకు తిరుగుతున్నాడు, పారిపోతున్నాడు, కావాలనే గైర్హాజరవుతున్నాడు అంటూ ఒక వర్గం మీడియా అదేపనిగా కథనాలు వడ్డించిన సంగతి తెలిసిందే. నాడు అవినాష్ తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు కాబట్టి విచారణను వాయిదా వేయమని సీబీఐని కోరారు.

ఆ సంగతి అలా ఉంటే… కనీసం కారణం కూడా చెప్పకుండా విచారణకు గైర్హాజరవుతున్నారు మార్గదర్శి కేసులోని ఏ1 – ఏ2లు! ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. జూలై 5న గుంటూరులోని ఆఫీసులో విచారణకు హాజరుకమ్మని అప్పట్లో నోటీసులు ఇస్తే దాన్నీ రామోజీరావు – శైలజా కిరణ్ లు పట్టించుకోలేదు. గైర్హాజరయ్యారు!!

ఇదే సమయంలో తాజాగా ఈ నెల 16, 17 తేదీల్లో విజయవాడలోని సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని రామోజీ, శైలజకు 9వ తేదీన నోటీసులు ఇచ్చారు. అయితే ఇద్దరూ వాటిని కూడా లెక్క చేయలేదు. పైగా విచారణకు హాజరుకాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా జవాబిచ్చారు. ఆ పరిస్థితులు ఏమిటో మాత్రం చెప్పలేదు!

దీంతో ఇంత బరితెగించి వ్యవహరిస్తున్నారేమిటి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇదే సమయంలో… అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందనే సామెతలా తయారైంది రామోజీ వ్యవహారం అని అంటున్నారు. దీంతో… ఇతరులకు నీతులు చెప్పటమే కానీ తాను ఆచరించనని రామోజీ తేల్చిచెప్పారని మరికొందరు అంటున్నారు. దీన్ని అసలు గైర్హాజర్ అంటారని అవినాష్ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.

మరోపక్క సీఐడీ ఆఫీసుకు విచారణకు రమ్మంటే రాముపొమ్మంటున్నారు.. విచారణకు సహకరించేది లేదు ఏం చేస్తారో చేసుకోండని చాలెంజ్ విసురుతున్నట్లుగా ఉన్నారు అని సీఐడీ భావిస్తోందని అంటున్నారు. దీంతో వీళ్ళిద్దరి వ్యవహారంపై సీఐడీ తొందరలోనే కోర్టులో పిటీషన్ వేయబోతోందని తెలుస్తోంది.

ఇన్ని రోజులూ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు కోర్టుకు విన్నవించనున్నారంట సీఐడీ అధికారులు. ఇలా ప్రవర్తించేవారి వల్ల చట్టాలపై సామాన్యులకు నమ్మకం తగ్గిపోయే ప్రమాధం ఉందని చెప్పబోతున్నారంట. ఫలితంగా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి కోరబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ విషయంలో కోర్టు ఏమి చెప్పబోతోంది.. తదుపరి చర్యలు ఎలా ఉండబొతున్నాయి అనేది వేచి చూడాలి. కాగా… ఈ దేశంలో చట్టం అందరికీ సమానమే అనే మాట పచ్చి అబద్ధం అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!