గత ఎన్నికల్లో వైఎస్ జగన్ హవాను తట్టుకుని టీడీపీ గెలిచిన స్థానాల్లో తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కూడ ఒకటి. ఇక్కడ వి.జోగేశ్వరరావు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. జోగేశ్వరరావుకు నియోజకవర్గంలో మంచి పేరుంది. వివాదాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఉంది ఓటర్లలో. అందుకే వైసీపీలో కీలక నేతగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఓడించి నెగ్గగలిగారు. ఈ నియోజకవర్గం మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినా జోగేశ్వరరావును ఓడించలేకపోయారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత కావడం, ఆర్థికంగా బలంగా ఉండటం, నిత్యం ప్రజల్లో ఉండటమే ఆయన్ను నిలబెట్టాయి.
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలిని సైతం ఎదిరించి జోగేశ్వరరావు గెలిచారంటే ఆయన బలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈయన ఉన్నంతవరకు మండపేటలో టీడీపీకి తిరుగుండదు. అందుకే చంద్రబాబు సైతం నియోజకవర్గం మొత్తాన్ని ఏకపక్షంగా ఈయన చేతుల్లో పెట్టేశారు. అందుకే ఆయన్ను పార్టీ నుండి బయటకు లాగితే టీడీపీని నేలమట్టం చేయవచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. అందుకే మండపేట కేంద్రంగా రాజకీయం మొదలైందని చెప్పుకుంటున్నారు. జోగేశ్వరరావుకు పలు వ్యాపారాలున్నాయి. అవే ఆయన ఆర్ధిక మూలాలు. ఆ దిశగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయట.
ఇప్పటికే టీడీపీలోని పలువురు కీలక నేతలు వ్యాపారాల పరంగా ఇబ్బందులుపడుతున్న సంగతి తెలిసిందే. ఆ ఇబ్బందులు తట్టుకోలేక పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు కొందరు లీడర్లు. జోగేశ్వరావును కూడ ఆ పరిస్థితికి తీసుకొచ్చే కుట్రలు జరుగుతున్నాయని మండపేట టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆయన్ను ఢీకొట్టడానికే తోటత్రిమూర్తులను రంగంలోకి దించారనే టాక్ ఉంది. త్రిమూర్తులు అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయినా ఆయనకు మండపేట ఇంఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఈ పరిస్థితుల నడుమ జోగేశ్వరరావు కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నారు. ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. దీంతో ఆయా మీద కూడ వైసీపీ వ్యూహాలు పనిచేస్తున్నాయా అనే అనుమానం కలుగుతోంది కేడర్లో.