సిగరెట్ కోసం వెళ్ళి ప్రమాదంలో పడిన యువకులు.. ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు!

దేశంలో ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వాహనాలు నడిపేవారి అజాగ్రత్త , నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిగరెట్ కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…మదనపల్లె పట్టణంలోని రెడ్డిస్‌ కాలనీకి చెందిన పి.గోపాలకృష్ణ (34)తోపాటు మదనపల్లె పట్టణంలోని అమ్మినేని వీధికి చెందిన రాహుల్‌, సాయిరాంలు వారి బంధువు మరణించడంతో పెద్దతిప్పసముద్రం మండలం కట్నాగల్టు పంచాయతీ బూచిపల్లెలో జరిగిన 11 రోజుల కార్యక్రమానికి వెళ్లారు. ఈ క్రమంలో వారికి సిగరెట్ తాగాలనిపించి తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సిగరెట్‌ తెచ్చుకునేందుకు ముగ్గురు కారులో వస్తుండగా మార్గమధ్యంలోని వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బూచిపల్లె కాట్నగల్లు మధ్యలో ఉన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కి ఫోన్ చేసి ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న గోపాలకృష్ణ అనే వ్యక్తి ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన గోపాలకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పెద్ద తిప్ప సముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గోపాలకృష్ణ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు సంవత్సరాల క్రితం గోపాలకృష్ణకు లావణ్య అనే యువతీతో వివాహం జరిగింది. భర్త మృతితో లావణ్య రోదన వర్ణనాతీతంగా మారింది.