ఔను, చంద్రబాబుకి ఇప్పుడు ఆ ‘పవర్’ లేదు.!

చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తారా.? అన్నదానిపై తెలుగు తమ్ముళ్ళలోనే నమ్మకం కనిపించడంలేదు. నారా లోకేష్ కారణంగా చాలామంది కీలక నేతలు, టీడీపీని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళలో ఎవరూ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. పార్టీకి ఆర్థికంగా ఒకప్పుడు వెన్ను దన్నుగా నిలిచిన నేతలూ ఇప్పుడు టీడీపీకి దూరంగా వున్నారు.

టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తే, ఇప్పటికే టీడీపీ వదిలి వెళ్ళిన నేతల్లో కొందరైనా వెనక్కి వచ్చే అవకాశం వుంటుంది. కానీ, నానాటికీ టీడీపీ స్థాయి దిగజారుతూనే వస్తోంది. దాంతో, గ్రాఫ్ పడిపోయిన టీడీపీలోకి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదని టీడీపీని ఇప్పటికే వీడి, వివిధ పార్టీలో సెటిలైపోయిన నాయకులు తెగేసి చెబుతున్నారట.

ఆయా నేతలతో, చంద్రబాబు కోటరీ సంప్రదింపులు జరుపుతోంటే, ఆ సమయంలో వారికి ఎదురవుతున్న అనుభవాల గురించి, ఛీత్కారాల గురించీ, ఉచిత సలహాల గురించీ రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా వున్న ఒకాయన, ఇప్పుడు చంద్రబాబు వైపు చూడటమే మానేశారట. బీజేపీలో చేరి, తన మీద నమోదైన కేసుల నుంచి ఉపశమనం పొందిన ఆయన, ప్రస్తుతం ఏ పదవీ లేకపోయినాగానీ, హాయిగా వున్నాననీ, తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేశారట.

ఇంకొకాయన మీద ఇటీవల ‘ఏక్ నాథ్ షిండే’ ఆరోపణలు వచ్చాయి. ఆయనైతే, అసలు తిరిగి టీడీపీ వైపు తాను చూడబోనని, అలాంటప్పుడు, టీడీపీ గురించి తానెందుకు ఆలోచిస్తానని చెబుతున్నారు. చంద్రబాబు అండ్ కో మాత్రం, 2024 ఎన్నికల కోసం ఆపరేషన్ స్వగృహ విషయంలో గట్టిగానే ఆశలు పెట్టుకున్నారట.