పవన్ కళ్యాణ్‌పై వైసీపీ కాపు అస్త్రం.! ప్రయోజనమెంత.?

రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన లేకుండా అన్నది జరిగే పని కాదు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు గతంలోనూ నడిచాయ్.. ఇప్పుడు నడుస్తున్నాయ్.. భవిష్యత్తులోనూ నడుస్తాయ్. వీటిని ఆపడం ఎవరి తరమూ కాదు.

ప్రజారాజ్యం పార్టీ సమయంలో కాపు సామాజిక వర్గంతోనే ఆ పార్టీని దెబ్బకొట్టాయి అప్పట్లో ప్రధాన రాజకీయ పార్టీలుగా వున్న కాంగ్రెస్, టీడీపీ. ఇప్పుడు జనసేన మీద కూడా ఆ కాపు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది వైసీపీ. టీడీపీ తక్కువేం తిన్లేదు.. టీడీపీ కూడా 2019 ఎన్నికల్లో జనసేనను కాపు అస్త్రంతోనే దెబ్బ తీసింది.

ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం ప్రముఖుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ‘కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం’ అనే నినాదం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయాలు చేయడంలేదనీ, ఆ కారణంగానే ఆయన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నామనీ కొందరు కాపు సామాజిక వర్గ ప్రముఖులు అంటున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ మీద టీడీపీ అలాగే వైసీపీలో కొందరు కాపు నేతలు చేస్తున్న విమర్శల పట్ల కాపు సామాజిక వర్గ ప్రముఖులు కొంత ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీలోని కాపు నేతల్ని టార్గెట్ చేయడం ఆ కాపు సామాజిక వర్గ ప్రముఖులకు మింగుడు పడ్డంలేదు.

వచ్చే ఎన్నికలు కాపు సామాజిక వర్గానికి అత్యంత కీలకమన్న చర్చ ఆ సామాజిక వర్గ పెద్దల్లో కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు టీడీపీని, వైసీపీని కూడా దెబ్బ తీస్తాయనీ, చివరి నిమిషంలో జనసేనకు అవి ఉపయుక్తంగా మారుతాయన్నది ఓ వాదన. కానీ, జనసేనాని తన చర్యలతో ఆ అవకాశాన్ని దెబ్బతీసుకునేలా వున్నారు.