జగన్మోహన విజయాన్ని దక్కించుకున్న వైసిపి

jaganmohan reddy

jaganmohan reddy

సరిగ్గా వారం రోజుల క్రితం….కిందటి ఆదివారం…అయిదు కోట్ల మంది ఆంధ్రులే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ టీవీలకు అతుక్కుని కూర్చున్న సన్నివేశం….నిముషాలు గడిచే కొద్దీ…ఒక్కొక్క ఫలితం వచ్చేకొద్దీ శరీరం రోమాంచితం అయ్యే ఉత్కంఠ…. పదిగంటలు అయ్యేవేళకు సునామి అనాలో లేక పెను ఉప్పెన అనాలో తెలియని ఉద్రేకం! శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు వీచిన ఫాన్ గాలి ధాటికి కమలం మలిగిపోయింది. గ్లాస్ భళ్ళున బద్దలై పోయింది. ఇక సైకిల్ ఏ కీలుకు ఆ కీలుకు విరిగిపోయింది. ఏ భాగం ఏ మూల పడిందో దుర్భిణీ వేసి గాలించినా దొరక్కపోవచ్చు. వైసిపికి సింహభాగం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు దక్కుతాయని అందరూ ఊహించిందే. కానీ తెలుగుదేశం పార్టీ ఇంత చిత్తుగా ఓడిపోతుందని వైసిపి వారు కూడా ఊహించలేదేమో! ఆ లభించిన విజయం మామూలు విజయం కాదు. సాధారణంగా మునిసిపాలిటీ అయినా, కార్పొరేషన్ అయినా ప్రత్యర్థి పార్టీలకు కూడా చెప్పుకోదగిన స్థానాలు దక్కుతాయి. అందునా ఇరవై మాసాల క్రితం వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతిచోటా ఎన్నోకొన్ని సీట్లు దక్కుతాయని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత కన్నా ఎక్కువ దూరంగా రెండు పార్టీలకీ మధ్య ఫలితాలు వెలువడ్డాయి. వైసిపికి నలభై, యాభై వచ్చినచోట తెలుగుదేశం పార్టీకి రెండు, మూడు స్థానాలు మాత్రమే వచ్చాయంటే ఫాన్ గాలి ఎంత ప్రభంజనంగా వీచిందో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాన్ ధాటికి తెలుగుదేశం పార్టీకి బలం అని భావించే కోటలు బదాబదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అశోక్ గజపతి రాజు, బోండా ఉమా, దేవినేని ఉమా మహేశ్వరరావు లాంటి నేతల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. అందరూ కోతల రాయుళ్లే తప్ప చేతలరాయుళ్లు కారని నగరపాలక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.

ఇక నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం, పదునాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వం, పన్నెండేళ్ల ప్రతిపక్షనాయక అనుభవం ఉందని పదేపదే స్వోత్కర్ష చేసుకునే చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకన్నా తీవ్రంగా ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ వైసిపికి దక్కితే ఉక్కు కర్మాగారం వెళ్ళిపోతుందని, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు గెలిస్తే అమరావతి వెళ్ళిపోతుందని విషప్రచారం చేశారు. ఆయన అసహనం ఎంత హద్దులు మీరిందంటే గుంటూరులో రోడ్ షో నిర్వహిస్తూ అక్కడి ప్రజలకు సిగ్గూశరం లేదని, యువకులకు పౌరుషం లేదని, అమరావతి కోసం తాను పోరాడుతుంటే ఇంటికొక్కరు కూడా ముందుకొచ్చి ఉద్యమంలో పాల్గొనలేదని ప్రజలను తీవ్రపదజాలంతో దూషించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని “వాడు..వీడు” అంటూ ఏకవచన అసభ్య ప్రయోగాలతో తన స్థాయిని అధఃపాతాళానికి దిగజార్చుకున్నారు. చంద్రబాబు ప్రచారతీరు చూసి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులే తమ గెలుపు మీద ఆశలు వదులుకున్నారంటే ఆయన ఎంతగా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారో అర్ధం చేసుకోవచ్చు. పైగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో వైసిపి గెలిస్తే అమరావతి గూర్చి తాము ఇక మాట్లాడబోమని కూడా కొందరు సీనియర్ తెలుగుదేశం నాయకులు ప్రకటనలు ఇచ్చారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అర్ధం అయిందేమిటంటే ప్రజలు అమరావతిని తమ రాజధానిగా భావించడం లేదని. చంద్రబాబు తలపెట్టిన అమరావతి అనేది కేవలం ఆయన సామాజికవర్గానికి చెందిన కొందరు బడానాయకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అని ప్రజలు సూటిగా బాలెట్ సాక్షిగా చెప్పేశారు. చంద్రబాబును ఎవ్వరూ నమ్మడంలేదని కూడా ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.

మరోవంక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రచారంలో పాల్గొనలేదు. ఒక్క మీడియా సమావేశం నిర్వహించలేదు. కనీసం తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వెయ్యమని కూడా అడగలేదు. నిండు కుండ తొణకదు అన్నట్లు వ్యవహరించారు. ప్రచారభారం మొత్తం మంత్రులకు, స్థానిక నాయకులకు అప్పగించి ప్రజలను మాత్రమే నమ్ముకున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు చూసి ప్రజలనే నిర్ణయించుకోమన్నట్లుగా సాధారణ ప్రభుత్వ విధుల్లో నిమగ్నం అయ్యారు. ఇది నిజంగా అత్యుత్తమ సంప్రదాయం. ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లేవారు కారు. మళ్ళీ మూడు దశాబ్దాల తరువాత అలాంటి తీరును జగన్మోహన్ రెడ్డిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దర్శించగలిగారు.

కొందరు విశ్లేషకులు కూడా వైసిపి విజయాన్ని విశ్లేషించడంలో తడబడ్డారు. ముఖ్యంగా ఎల్లోమీడియాలో అనునిత్యం జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కే విశ్లేషకులు, పార్టీల అధికార ప్రతినిధులు వైసిపి సాధించిన అసాధారణ విజయాన్ని తక్కువగా చేసి చూపించడానికి తెగ ప్రయత్నించారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండేళ్లే అయింది కాబట్టి వ్యతిరేకత పెద్దగా పొటమరించలేదని, స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే సంక్షేమ, అభివృద్ధి పధకాలు అందవేమో అని భయపడ్డారని తమ నైజాన్ని బయటపెట్టుకున్నారు. నిజానికి ప్రభుత్వం పట్ల ఎంత అనుకూలత ఉన్నప్పటికీ ఫలితాలు ఇంత ఏకపక్షంగా వస్తాయా? ముఖ్యంగా అమరావతి కావాలని జనం అనుకుంటే కనీసం ఆ జిల్లాల్లో అయినా తెలుగుదేశం పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు రాకుండా ఉంటాయా? కొద్దిమంది జనాభా ఉండే పల్లెల్లో భయపడతారనుకున్నా, లక్షలమంది జనాభా నివసించే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూర్ లాంటి నగరాల్లో జనం భయపడతారా? అసలు వైసిపి ఇంతటి ఘనవిజయాన్ని సాధించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల సానుకూలత, ఆయన పట్ల విశ్వసనీయత, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారనే గౌరవం, ఇంటింటికీ సంక్షేమ పధకాలు తప్పనిసరిగా అందుతున్నాయని అబ్బురం, గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాలద్వారా సాకారం చెయ్యడం, ప్రభుత్వ పధకాలను గడపగడపకు చేర్చుతున్న వాలంటీర్ల వ్యవస్థ, కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి తమకు అందించిన సౌకర్యాలు, కలిగించిన ధైర్యం, అందించిన వైద్యం, అవినీతికి తావులేని సుపరిపాలన పట్ల ప్రజల మనస్సులో నెలకొన్న అభిమానం లాంటి అనేక హేతువులు వైసిపికి ఏకపక్ష విజయాన్ని సమకూర్చిపెట్టాయి.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు చావుదెబ్బ తిన్నాయి. వాటికి ఎక్కడా కనీసం పది స్థానాలు కూడా దక్కలేదు. ఒక్క తాడిపత్రి మినహా ఇతర అన్ని మునిసిపాలిటీల్లోనూ తెలుగుదేశం పార్టీకి రెండంకెల స్థానాలు దక్కలేదు. బీజేపీ జీరోగా మిగిలిపోగా, జనసేన ఒక్క అమలాపురంలో అయిదు వార్డులను గెలుచుకుంది. బీజేపీ జనసేన కూటమిని ఓటర్లు అంగీకరించలేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం, జనసేన లోపాయికారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ అది విఫలప్రయోగంగానే మిగిలింది. కొన్ని జిల్లాలకు జిల్లాలే ఏకపక్షమయ్యాయి.

నిజం చెప్పాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇరవై మాసాల పాలన మీద అఖిలాంధ్రులు తమ హార్షాతిరేకాలను ఓట్ల రూపంలో ప్రకటించారు. మున్ముందు కూడా వైసిపి ఇదే తరహా పాలన కొనసాగిస్తూ ప్రజాభిమానాన్ని పదికాలాల పాటు నిలుపుకోవాలని ఆశిద్దాం.

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు