ఈసారి తన లక్ష్యం 175 కి 175 అని జగన్ ఒకపక్క ఢంకా భజాయించి చెబుతున్న పరిస్థితి ఏపీలో నెలకొంది. ఏ సభకు వెళ్ళినా… ఈసారి 175కి 175 సీట్లు సాధించాలని.. ఫలితంగా మరో 30 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రశాంతంగా పాలించాలని అంటుంటారు జగన్. మరి పైన తదాస్తు దేవతలు ఉన్నారో ఏమో కానీ.. టీడీపీలో పెద్ద తలకాయల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని, ఇంకా గట్టిగా మాట్లాడితే ఈసారి కష్టమే అని కామెంట్లు వినబడుతున్నాయి. వాటికి కొన్ని సర్వేలు బలం చేకూరుస్తున్నాయి.
వివరాల్లోకి వస్తే… ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుకి ఈసారి టెక్కలిలో ఎదురుగాలులు వీయనున్నాయని తెలుస్తోంది. వరసబెట్టి రెండు సార్లు టెక్కలి నుంచి గెలుస్తూ వస్తున్న అచ్చెన్నకు… ఈసారి టెక్కలి ప్రజలు షాకివ్వబోతున్నారట! న్యూట్రల్ సంస్థలు చేసిన సర్వేలతో పాటు.. టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయని అంటున్నారు.
టెక్కిలి నియోజకవర్గం అనేది టీడీపీ కచుకోటల్లో ఒకటి. 1994లో ఎన్టీఆర్ టెక్కలి నుంచి పోటీచేసి భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆ తరువాత హిందూపురాన్ని ఎంచుకుని టెక్కలిని వదిలేశారు పెద్దాయన! అలాంటి కంచుకోటనుంచి పోటీచేసే అవకాశం అచ్చెన్నాయుడికి వచ్చింది. మొదటిసారి 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అచ్చెన్నా ఓటమి పాలు అయ్యారు. అనంతరం… 2014, 2019ల్లో వరుసగా గెలిచారు.. టెక్కలిపై పట్టు సాధించారు.
అవును… 2014లో మాత్రం అచ్చెన్నాయుడు తొలిసారి టెక్కలి నుంచి 8387 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో జగన్ వేవ్ లో సైతం అచ్చెన్నాయుడు మరోసారి విజయం సాధించారు. ఈసారి కూడా అచ్చెన్నకు దాదాపుగా 2014 మాదిరిగానే 8545 మెజారిటీ లభించింది. అయితే… 2024లో మరోసారి అచ్చెన్న ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా… 2014లో ఆయన చేతిలో ఓటమిపాలైన దువ్వాడ శ్రీనివాస్ ఈసారి తలపడబోతున్నారు. అయితే సామాజిక సమీకరణల దృష్ట్యా… ఈసారి కచ్చితంగా కాళింగుల సపోర్టుతో దువ్వాడ శ్రీనివాస్… అచ్చెన్నను అసెంబ్లీకి దూరం చేసే ఛాన్స్ ఉందట!
ఏదిఏమైనా.. పార్టీ ప్రెసిడెంట్ పరిస్థితే ఇలా ఉంటే… ఆ ఎఫెక్ట్ కచ్చితంగా మిగిలిన అభ్యర్థులపై ఉంటుందని భావిస్తున్న తమ్ముళ్లు – జగన్.. 175 అని అంతగట్టిగా ఎందుకంటున్నారో ఇప్పుడు తెలిసిందని వ్యాఖ్యానిస్తున్నారు!