చేతులెత్తేసిన వైసీపీ ఉత్తరాంధ్ర మంత్రి.!

అసలేం జరిగింది.? ఉత్తరాంధ్రలో ఓ వైసీపీ మంత్రి, ‘మళ్ళీ అధికారంలోకి రావడం అనేది జరిగే పని కాదు..’ అంటూ సన్నిహితుల వద్ద ఎందుకు తెగేసి చెబుతున్నారు.? ఈ విషయమై వైసీపీలో అంతర్గతంగా బోల్డంత రచ్చ జరుగుతున్నా, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.

కొద్ది రోజుల క్రితమే, సదరు మంత్రిగారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మీదే బాధ్యత’ అంటూ సంబంధి జిల్లా వ్యవహారాల గురించి బాధ్యతలు అప్పగించారట. ‘మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి. జిల్లాలో క్లీన్ స్వీప్ చేసెయ్యాలి.. దానికి ఏం చేయాలన్నా చేద్దాం..’ అంటూ మంత్రిగారికి చెప్పారట ముఖ్యమంత్రి.

అయితే, ‘ఇప్పుడు చేయడానికేమీ లేదు. చెయ్యి దాటిపోయింది. వాలంటీర్ వ్యవస్థ మనం అనుకున్నట్లుగా పని చెయ్యడంలేదు. కింది స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరు. ప్రజల సంగతి సరే సరి..’ అంటూ ముఖ్యమంత్రి వద్ద సదరు మంత్రి వాపోయారట.

‘అయినా నా ప్రయత్నం నేను చేస్తాను.. క్లీన్ స్వీప్ అన్న ఆలోచనే పెట్టుకోవద్దు..’ అని ముఖ్యమంత్రిగారికి సదరు మంత్రి తెగేసి చెప్పారట. సాధారణంగా ఇంత నిక్కచ్చిగా ముఖ్యమంత్రి దగ్గర వైసీపీ నేతలెవరూ మాట్లాడే పరిస్థితి వుండదు. కానీ, ఆ మంత్రిగారిని ప్రత్యేకంగా అభిమానిస్తారు ముఖ్యమంత్రి. ఆ అభిమానంతో, చనువుతో.. కీలక విషయాలపై నిర్మొహమాటంగా ఇద్దరి మధ్యా చర్చ జరిగిందట.

జిల్లాకి చెందిన కీలక నాయకుడితో సదరు మంత్రిగారికి చిన్నపాటి రాజకీయ వైరం వుంది. ఆ వైరం సంగతెలా వున్నా, ఆ కీలక నాయకుడు.. దారుణమైన ఓటమి చవిచూడబోతున్నట్లుగా ముఖ్యమంత్రికి, సదరు మంత్రిగారు తెగేసి చెప్పారన్నది తాజా ఖబర్.