గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్ధుల గెలుపును వైసిపి చాలెంజ్ చేస్తోంది. పై రెండు నియోజకవర్గాల్లో గెలిచిన గల్లా జయదేవ్, కింజరాపు రామ్ మనోహర్ నాయుడు గెలుపు అన్యాయమంటూ ఓడిపోయిన వైసిపి అభ్యర్ధులు మోదుగుల వేణుగోపాల రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే పై ఇద్దరి గెలుపుపై వైసిపి కోర్టులో కేసు వేస్తోంది.
గుంటూరులో గెలిచిన గల్లాకు వచ్చిన మెజారిటీ 4200. పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను సాంకేతిక కారణాలు చూపి రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్న కారణంతో ఏకంగా 9500 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించలేదు. ఈ విషయమై వైసిపి అభ్యర్ధి అభ్యంతరం చెప్పినా పట్టించుకోకుండా గల్లా గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించేశారు.
రిటర్నింగ్ అధికారి చంద్రబాబు, గల్లాతో కుమ్మకవ్వటం వల్లే టిడిపి విజయం సాధించినట్లు ప్రకటించేశారని మోదుగుల ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేకపోయినా మిగిలిన నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కించినపుడు గుంటూరులో మాత్రం ఎందుకు రెజెక్టు చేశారని ప్రశ్నిస్తున్నారు.
ఇదే పద్దతిలో శ్రీకాకుళంలో ఓడిపోయిన అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ కూడా కోర్టులో కేసు వేస్తున్నారు. గుంటూరులో రిటర్నింగ్ అధికారి చేసినట్లే శ్రీకాకుళంలో రిటర్నింగ్ అధికారి కూడా ఏకపక్షంగా ఫలితాన్ని ప్రకటిచింనట్లు మండిపడుతున్నారు. కాబట్టే కోర్టులో కేసు వేస్తున్నట్లు వైసిపి చెప్పింది.