పంటపొలాల దగ్ధం కేసులో తన పాత్ర పై సాక్ష్యాలు ఉన్నాయని మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు చెప్పారని వైసీపీ బాపట్ల లోక్ సభ అభ్యర్ధి నందిగామ సురేష్ అన్నారు. అయితే సాక్ష్యాల ఆధారంగానే కేసు పెట్టాలని తాను కోరానన్నారు. దీంతో ఆగ్రహోద్రుడైన ఆయన.. ‘ఇంతసేపు లాజిక్కులు మాట్లాడుతున్నావేంట్రా?’ అని కాలితో ఎగిరితన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఐ చిట్టెం కోటేశ్వరరావు ఎగిరి తన్నడంతో తాను మరేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయానని తెలిపారు. ‘నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగలేదు. కాళ్లతో తన్నారు. తిట్టకూడని మాటలన్నీ తిట్టారు. ఇప్పుడు మీముందు చెబుతున్నా సార్. ఈ విషయం నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. సీఐ చిట్టెం కోటేశ్వరరావు ‘నిన్ను చంపి నీ భార్యను నాకాడ పెట్టుకుంటా’ అని చెప్పాడు. అతను ఇప్పుడు బాపట్ల రూరల్ సీఐగా ఉన్నాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇంతకంటే అవమానం ఉంటుందా?’ అని సురేష్ కన్నీటిపర్యంతమయ్యారు.
తన నోట్లో రివాల్వర్ పెట్టి హింసించారని నందిగామ సురేష్ తెలిపారు. ‘కొద్దిరేపు రివాల్వర్ నోట్లో పెట్టడం, మరికాసేపు తలవెనుక పెట్టి జుట్టుపట్టి లాగేవాడు. చిట్టెం కోటేశ్వరరావుకు ఫోన్ వస్తే అతను నా భుజంపై కాలు పెట్టి మాట్లాడాడు సార్. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి సీఎంతో మాట్లాడిస్తామనీ, ఏదో పదవి, నగదు ఇప్పిస్తామని చెప్పారు.
‘ఒక సీఎం రా.. ఆయన ఎదురుగా కూర్చోవడానికి నీకు అవకాశం వచ్చింది. ఏదో పదవి ఇస్తాడు. జగన్ పేరు చెప్పు. అంతా అయిపోతుంది. నీకు చంద్రబాబే రెండ్రోజుల్లో బెయిల్ ఇప్పిస్తారు. మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఈ గొడవలన్నీ నీకు ఎందుకు? హాయిగా కారులో తిరుగు. మమ్మల్ని ఉదయం నుంచి ఇబ్బంది పెడుతున్నావ్’ అని ఆశచూపారని సురేష్ పేర్కొన్నారు.