వైకాపాలో రెడ్డి సామాజికవర్గం ప్రాభల్యం ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి నుండి దాదాపు అన్ని కీలక పదవుల్లోనూ రెడ్డి నేతలే ఉన్నారు. కొందరు పదవుల్లో ఉంది డామినేట్ చేస్తుంటే ఇంకొందరు పదవులు లేకపోయినా హవా చూపిస్తున్నారు. రెడ్డి అనేది పార్టీలో ఒక క్వాలిఫికేషన్ అయిపోయిందనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఈ పద్దతి కోటరీ వరకే పరిమితమైతే పర్వాలేదు. కానీ కింది స్థాయి నేతలు కూడ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని లీడర్లు కూడ ఇదే పంథాలో ఉన్నారు. అసలు పదవులే లేని నాయకులు కూడ రెడ్డి వర్గానికి చెందినవారమనే ఒకే ఒక్క కారణం చూపించి ఎమ్మెల్యేలను బెదరగొట్టేస్తున్నారు. ఈ పరిస్థితే నడుస్తోంది గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో.
ఇక్కడ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా కోన రఘుపతి ఉన్నారు. ఈయన 2014లో కూడ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో మంచి పేరుంది. నెమ్మదస్తుడు, సౌమ్యుడనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఏనాడూ వీధి పోరాటాలకు, మాటల యుద్ధాలకు దిగిన బాపతు కాదు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. కోన ప్రభాకర్ కు రాజకీయ వారసుడు. బాపట్లలో బ్రాహ్మణ సామాజికవర్గం మెండుగా ఉండటంతో ఈయన గత రెండు దఫాల్లో నెగ్గుకొచ్చారు. స్వతహాగా మెతక వైఖరి కలిగిన వారు కావడంతో లోకల్ రెడ్డి లీడర్లు ఈయన్ను డామినేట్ చేస్తున్నారట. అసలు గత ఎన్నికల్లోనే రెడ్డి వర్గం తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ జగన్ మాత్రం రఘుపతి సౌమ్యుడని, ఆయన కుటుంబానికి మంచి పేరుందనే కారణంతో అందరినీ పక్కనబెట్టి టికెట్ ఇచ్చారు.
2014 ఎన్నికల్లో గెలిచినా అధికారం లేకపోవడంతో పెద్దగా పనులేవీ జరిపించకలేకపోయారు రఘుపతి. కానీ ఈసారి మాత్రం పార్టీ అధికారంలోకి వస్తుందని, గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చూపిస్తానని ఓట్లు పొందారు. గెలిచాక మంత్రి పదవిని ఆశించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చి సరిపెట్టారు జగన్. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసింది. జరిగే అరకొర పనులు కూడ నత్త నడకన సాగుతున్నాయి. అందరు ఎమ్మెల్యేల్లాగానే ఆయన కూడ అధిష్టానం చల్లని చూపు కోసం, నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్లో రెడ్డి వర్గం చెలరేగిపోతోందట. ఎమ్మెల్యేను డమ్మీని చేసి అంతా తామే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఎక్కడా రఘుపతి పేరు వినబడకుండా మేనేజ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఈ వెసులుబాటును వినియోగించుకుని తెలుగుదేశం బలపడే పనిలో ఉంది. అక్కడ టీడీపీ ఇంచార్జ్ ఆయిన వేగేశ్న నరేంద్ర వర్మ దూకుడుగా ఉన్నారట. తెలుగుదేశం శ్రేణుల్లో కూడ రెడ్డి వర్గానికి చెందినవారు ఉన్నారు. వారు వైసీపీ నేతల్లా తమ వర్గమే ముందుండాలనే ధోరణిలో కాకుండా నరేంద్ర వర్మకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. దీంతో నరేంద్ర ఎక్కడికక్కడ కేడర్ ను బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారని, సాధ్యమైనంతలో జనానికి పనులు చేసిపెడుతున్నారట. ఫలితంగా కోన ప్రాభల్యానికి అటు వైసీపీ నుండి ఇటు టీడీపీ నుండి డ్యామేజ్ జరిగిపోతోంది.