గతకొన్ని రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కో జిల్లాలో వరుసగా మీటింగ్స్ పెడుతూంటారు. ఆ సందర్భంగా ఆయన బటన్ నొక్కి లద్భిదారులకు మనీ ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ పథకం విశిష్టత గురించి.. తన పాలన గురించి చెబుతూనే ప్రత్యర్ధులను వాయించేస్తుంటారు. తాజాగా జరిగిన బాపట్ల మీటింగులో మునుపెన్నడూ లేనివిధంగా జగన్ ఒక్కసారిగా డోస్ పెంచేశారు. చంద్రబాబుతో పాటు మరిముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలే చేసారు.
బాపట్ల కేంద్రంగా… పవన్ కల్యాణ్ కి ఫుల్ డోస్ ఇచ్చేశారు సీఎం జగన్. మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుకంటే ఎక్కువగా పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. పదే పదే ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. దత్త తండ్రి, దత్త పుత్రుడంటూ.. చంద్రబాబు, పవన్ ని కలిపి ఆటాడేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ – చంద్రబాబు కలయికలపై జనాలకు అర్ధమయ్యేలా చెప్పడానికి జగన్ తాపత్రయపడినట్లు అర్ధమవుతుంది.
షూటింగ్ కి షూటింగ్ కి మధ్య గ్యాప్ లో పవన్ ఏపీకి వస్తారని, చంద్రబాబుకి ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం తనపై విమర్శలు చేసి వెళ్తుంటారని జగన్ అన్నారు. ఇది ఏపీలో విపరీతంగా ప్రచారంలో ఉన్న విషయం కావడం గమనార్హం! ఇక పవన్ పొలిటికల్ కెరీర్ పై పంచులేసిన జగన్… పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన ఆయన… కనీసం 175 స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోతున్నారని, రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇంకేం రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో “ఎస్ బాస్” అంటూ పవన్ పై చణుకులు విసిరారు వైఎస్ జగన్. చంద్రబాబు ఏం చెబితే దానికి ఎస్ సార్, అలాగే సార్ అంటూ పవన్ తల ఊపుతారని.. కలసి పోటీ చేద్దాం అని చంద్రబాబు ఆఫర్ ఇస్తే ఎస్ సార్ అంటారని.. విడివిడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభం అంటే.. అలాగే సార్ అని బదులిస్తారని జగన్ సెటైర్స్ వేశారు. కమ్యూనిస్ట్ లతో కలువు పవన్ అంటే కలిసిపోతారని, బీజేపీకి విడాకులివ్వు పవన్ అనగానే ఇచ్చేస్తారని.. జగన్ ని తిట్టు అంటే తిడతారని.. ఇదే పవన్ రాజకీయం అని జగన్ మండిపడ్డారు. తన ప్రసంగంలో దాదాపు నాలుగైదు సార్లు పవన్ ని ప్యాకేజ్ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.