కాలానికి ఉన్న గొప్పతనం అదే.! కాస్త ఆలస్యం అయినా అందరికీ తత్వం బోధపడేలా చేస్తుంది! నిజానికీ, నీడకీ.. వాస్తవానికీ, భ్రమకి.. సత్యానికీ, గ్రాఫిక్స్ కి తేడా తెలిసేలా చేస్తుంది! ఇదే క్రమంలో వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ నేత ఉండవల్లి శ్రీదేవి కి తాజాగా ఒక విషయం ఈరోజే అర్ధమయ్యిందంట. దీంతో… ఆన్ లైన్ వేదికగా కత్తి దూస్తుందామె! ఇంతకూ ఎందుకా అని కాస్త గతానికి వెళ్లి, వర్తమానాన్ని మిక్స్ చేస్తే మేటర్ బయటకు వచ్చేసింది!
“లబ్ డబ్ అని కాదు.. జగన్ జగన్ అని నా గుండె కొంట్టుకుంటుంది”… ఇది ఒకప్పుడు అసెంబ్లీలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి చెప్పిన డైలాగులు. అప్పట్లో ఇవి తెగ వైరల్ అయ్యాయి లెండి! ఇంతలోనే ఏమైందో… జగన్ తో విభేదించి టీడీపీలో చేరారు శ్రీదేవి. అప్పుడు అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ… ఎన్నికల సమయం వచ్చేసరికి బాబు తన మార్కు జూలు విధిలించారు.. దీంతో ఆన్ లైన్ వేదికగా కత్తి దూస్తున్నారు శ్రీదేవి.
టీడీపీలో చేరిన సమయంలో శ్రీదేవికి టిక్కెట్ ఆఫర్ చేశారట చంద్రబాబు. దీంతో… బాబు మాటలు పూర్తిగా నమ్మిన శ్రీదేవి… అవకాశం ఉంటే తాను సిట్టింగ్ గా ఉన్న తాడికొండ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వండి సర్.. లేకపోతే తిరువూరు అసెంబ్లీ కానీ, బాపట్ల లోక్ సభ టిక్కెట్ కానీ ఇచ్చే విషయాన్ని పరిశీలించండని చెప్పారంట. దీంతో… ఆ మూడు టిక్కెట్లలో ఏదో ఒకటి దక్కుతుందనే ఆశతో నిన్నటివరకూ ఎదురుచూస్తున్నరంట.
సరిగ్గా ఈ సమయంలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. వాస్తవానికి తొలి జాబితాలోనే తాడికొండకు తెనాలి శ్రావణ్ కుమార్ ను, తిరువూరు కి కొలికపూడి శ్రీనివాస్ ని అభ్యర్థులుగా ప్రకటించారు చంద్రబాబు. అయితే శ్రీదేవికి బాపట్ల రూపంలో మూడో ఆప్షన్ కూడా మిగిలి ఉండటంతో ఆమె చంద్రబాబుపై ఇంకా నమ్మకంగా, ఆశగా ఉన్నారంట. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాను విడుదల చేశారు.
ఈ జాబితాలో కూడా శ్రీదేవి పేరు లేదు. సరికదా… తాజాగా ప్రకటించిన 13 లోక్ సభ స్థానాల్లోనూ బాపట్ల పేరు చేర్చిన చంద్రబాబు… అక్కడ టి. కృష్ణ ప్రసాద్ అనే అభ్యర్థిని ప్రకటించారు. దీంతో… చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని ఆఫ్ ద రికార్డ్ ఫైర్ అవుతున్న శ్రీదేవి… ఆన్ ది రికార్డ్ మాత్రం ఒక ట్వీట్ చేసి, కత్తి దూస్తున్నారు. ఇందులో భాగంగా… “రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!” #Bapatla 🗡️… అని ట్వీట్ చేశారు.
దీంతో… ఉండవల్లి శ్రీదేవికి తత్వం బోధపడటానికి చాలామందితో పోలిస్తే తక్కువసమయమే పట్టిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి కత్తి దూస్తున్న శ్రీదేవి నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది వేచి చూడాలి.