వైసిపి మూత పడటం ఖాయమా ?

అదేంటి రేపటి కౌంటింగ్ లో అధికారంలోకి రాబోయే పార్టీ వైసిపినే అని అనుకుంటున్నారు కదా ? మరి పార్టీ మూతపడటం ఏంటనే అనుమానం వస్తోందా .? ఈ మాట చెప్పింది జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు లేండి. మే 23 కౌంటింగ్ తర్వాత వైసిపి మూత పడటం ఖాయమని జోస్యం చెప్పేశారు. అందుకనే భారతీయ జనతా పార్టీలో విలీనం అవ్వటానికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

మీడియాతో మాట్లాడిన మంత్రి వీలనం గురించి చెప్పారు.  అ చర్చలేవో మంత్రి ముందే జరుగుతున్నట్లు చెబుతున్నారు. విలీనం చేయటానికి అనుసరించాల్సిన ప్రక్రియను వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ చూస్తున్నారట. పైగా వచ్చే రిపబ్లిక్ దినోత్సవం నాటికి విజయసాయి జైలు జీవతం ఖాయమని కూడా దేవినేని చెబుతున్నారు.

అయితే తానుండాల్సింది తీహార్ జైలా లేకపోతే రాజమండ్రి జైలా అని విజయసాయరెడ్డే తేల్చుకోవాలని మంత్రి చెప్పారు. అంటే తాము ఏ జైల్లో ఉండాలని అనుకుంటున్నారో తేల్చుకునే అవకాశాన్ని చంద్రబాబునాయుడు సర్కార్ ఖైదీలకే ఇచ్చినట్లుంది దేవినేని మాటలు చూస్తుంటే. జగన్, విజయసాయి జనం మధ్యలో ఉండదగిన వారు కాదని మంత్రి అభిప్రాయపడ్డారు.

జనాల అభిప్రాయమేంటో ఇప్పటికే ఈవిఎంల్లో నిక్షిప్తం అయిపోయింది. ఎవరు ఎక్కడుండాలో, ఎవరిని ఎక్కడుంచాలో జనాలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఆ మేరకు తీర్పు కూడా చెప్పేశారు.  23వ తేదీన వచ్చే తీర్పు వరకూ వేచి ఉండకుండా  దేవినేనిలో ఆ దూకుడేంటో అర్ధం కావటం లేదు.