ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ డబ్బు పంచిందా.?

YCP

ఓడిపోయిన పార్టీలు ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటే.. ‘అది గెలుపు కాదు, డబ్బు కారణంగా వచ్చిన బలుపు’ అని. ఇందులో కొంత వాస్తవం లేదు. ఎక్కువ ఖర్చు చేసినోడు గెలుస్తాడు, కాస్త తక్కువ ఖర్చు చేసినోడు ఓడతాడు. అసలు ఖర్చు చేయనోడు గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడున్న రాజకీయాల్లో.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. డబ్బులివ్వనిదే ఓట్లు వెయ్యడానికి ఓటర్లు కూడా ఇష్టపడటంలేదన్నది నిర్వివాదాంశం. అందరూ అలాగే వున్నారా.? అంటే, గంపగుత్తగా జనం నిలబడి, ఓటుకు రేటుని నిర్ణయిస్తున్న పరిస్థితుల్ని చూశాక, ఓట్లు అమ్ముడుపోతున్నాయని అనకుండా ఎలా వుండగలం.? ఆత్మకూరులో జరిగిందేమిటి.?

‘మేం పనులు మానుకుని ఓట్లెయ్యడానికి రావాలా.?’ అంటూ ఓటర్లు బాహాటంగానే ప్రశ్నించారు. ‘ఓటుకి 2 వేల వరకూ ఇచ్చారు.. గతంలో అది నాలుగైదు వేల వరకూ పలికింది..’ అంటూ ఓటర్లు చెప్పడం ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా కనిపించింది.

డబ్బులు తక్కువగా ఇవ్వడంతోనే, ఆత్మకూరు ఉప ఎన్నికలో పోలింగ్ తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార పార్టీ సంక్షేమ పథకాల జాతర సంగతి పక్కన పెడితే, మంత్రిగా పని చేసిన ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి అకాల మరణం కారణంగా ఉప ఎన్నిక వచ్చింది.

అయినా, కొందరు ఓటర్లు తగ్గేదే లే.. సొమ్ములు తక్కువైతే ఓటేసేది లే.. అని తెగేసి చెప్పేశారు. ఆ ఓటర్ల మాటలు పట్టుకుని, వైసీపీ కేవలం డబ్బులతోనే గెలిచిందని బీజేపీ ఆరోపిస్తుండడం కొసమెరుపు.