జగన్ పై దాడి కేసులో దూకుడు పెంచిన వైసీపీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసు ఇంకా కొలిక్కి రాలేదు. వారం రోజులుగా సిట్ అనేక కోణాల్లో విచారణ జరుపుతోంది. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్యాప్రయత్నం జరిగి వారం రోజులు అవుతున్నా ఇంతవరకు పోలీసులు అసలు నిజం తేల్చలేకపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో వైసీపీ నేతలు దూకుడు పెంచారు. ఆ వివరాలు కింద చదవండి.

జగన్ పై దాడి కేసును ఏపీ ప్రభుత్వం, అధికారులు కలిసి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేషున్నారు వైసీపీ శ్రేణులు. ఈ కేసు విచారణపై ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన వైసీపీ నేతలు కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ తో భేటీ అయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ దాడి జరిగినప్పటి నుండి జగన్ మరియు పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. దాడిపై అధికార ప్రభుత్వం కుట్ర కూడా ఉందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యూడిషియల్ విచారణ కోరారు. ఈ మేరకు రాజనాధ్ సింగ్ తో బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, వరప్రసాద్, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు.

ఆరోజే రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నించారు. రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ అపాయింట్మెంట్ కూడా కోరారు. కానీ ఆరోజు కలవడం కుదరలేదు. అయితే ఈ నెల 9 న ఆ పార్టీ నేతల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. జగన్ పై ఎయిర్పోర్టులో జరిగిన దాడి గురించి రాష్ట్రపతికి వివరించనున్నట్టు తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రాష్ట్రపతిని కోరనున్నట్టు తెలిపారు.

కాగా అక్టోబర్ 31 న వైసీపీ అధినేత జగన్ కూడా హై కోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యం వలనే తనపై దాడి జరిగిందని పిటిషన్ దాఖలు చేసారు. తనపై జరిగిందని హత్యాయత్నమే అని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే జగన్ పై జరిగిన దాడి గురించి వైవీ సుబ్బారెడ్డి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసారు. అంతకంటే ముందే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ రెండు పిటిషన్ల విచారణ వాయిదా పడటంతో జగన్ స్వయంగా రిట్ పిటిషన్ వేశారు.

సిబిఐ కాకపోయినా ప్రభుత్వానికి సంబంధించిన మరే దర్యాప్తు సంస్థతో అయినా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ, ఎయిర్పోర్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిట్ ఇంచార్జి అధికారి, కేంద్ర హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. ప్రభుత్వం పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా పేర్కొన్నారు.కేసును రాజ్యాంగబద్దంగా కాకుండా…రాజకీయ కోణంలో పరిశీలిస్తున్నారని ఈ పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రతిపాదించారు.