Raghu Rama Krishna Raju: 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత ఆ పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారైన సంగతి తెలిసిందే. ‘రచ్చబండ’ పేరుతో నానా రచ్చా చేస్తూ వార్తల్లోకెక్కారు రఘురామ. ఈ క్రమంలో రఘురామపై పలు కేసులు నమోదయ్యాయి. రాజద్రోహం కేసులో ఏకంగా ఆయన అరెస్టయ్యారు కూడా. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారనుకోండి.. అది వేరే సంగతి.
తనను అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిందంటూ ఆరోపిస్తుంటారాయన. ఈ మేరకు ఆయన కోర్టుని కూడా ఆశ్రయించారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ తరఫున, బీజేపీ తరఫున.. ఒక్కోసారి జనసేన తరఫున కూడా వకాల్తా పుచ్చుకుంటుంటారు రఘురామకృష్ణరాజు.
కొందరు వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని వుందని పేర్కొంటూ కేంద్రం నుంచి అదనపు భద్రతను కూడా రఘురామకృష్ణరాజు పొందారు. తనలాగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి కూడా భద్రతా పరంగా అధికార పార్టీ నుంచి ముప్పు వుందని రఘురామ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అనుమానాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి రాసిన లేఖలోనూ ప్రస్తావించారాయన.
గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ భద్రతపై జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ని హత్య చేసేందుకు 250 కోట్ల సుపారీ కూడా ఇచ్చినట్లు తమ వద్ద సమాచారం వుందని జనసేన అంటోంది. మరోపక్క, జనసేనాని ఇంటి వద్ద కొందరు దుండగులు రెక్కీ నిర్వహించడమూ ఆ అనుమానాల్ని బలపరుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రికి రఘురామ లేఖ రాయడం గమనార్హం. పైగా, జనసేనాని విశాఖ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నాయకులపై విశాఖ పోలీసులు అతిగా స్పందించి, కస్టోడియల్ టార్చర్ చేశారని రఘురామ కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.