వైసిపి నాయకత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఫైర్

వైసిపి నాయకత్వంపై ఒక ఎమ్మెల్యే బహరింగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. తన నియోజకవర్గంలో సమస్యలపై వైసిపి నాయకత్వం పట్టించుకోవడంలేదని ఆయన నాయకత్వంపై మండిపడ్డారు. విజయనగరం జిల్లా సాలూరులో విష జ్వరాలపై అటు సర్కారు పట్టించుకోక పోగా తన పార్టీ నాయకత్వం కూడా సర్కారును నిలదీయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారును విమర్శిస్తే సరే కానీ సొంత పార్టీపై విమర్శలు చేయడం వైసిపి పార్టీలో కలవరం రేపింది. పూర్తి వివరాలు చదవండి.

విజయనగరం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారని దీనిని అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైసీపి జిల్లా, రాష్ట్ర నాయకులకు చెప్పిన కూడా వారు దీనిని పట్టించుకోవడం లేదని నిరాశని వ్యక్తం చేశారు. ప్రజల జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. మూడు రోజుల్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం స్పందించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారాయి. విష జ్వరాలు వస్తే ప్రభుత్వాన్ని విమర్శించడంలో అర్ధం ఉంది కానీ వైసీపీ కూడా పట్టించుకోవడం లేదనడంపై వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్వంత పార్టీపైనే పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడంతో వైసీపీ నాయకత్వం దీనిని సీరియస్ గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వ నేతలు ఎమ్మెల్యేతో మాట్లాడి జగన్ తో చర్చించనున్నట్టు నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేకి కోపం వచ్చినా అది అంతర్గతంగా చెబితే బాగుండేదని నేతలు చర్చించుకుంటున్నారు.