వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్ళారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ఎమ్మల్యే జక్కంపూడి రాజా. ఆయనేమీ మంత్రి కాదు.
కానీ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని, జనసేన వీర మహిళలు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరద బాధిత కుటుంబాలకు పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలన్నది జనసేన వీరమహిళల డిమాండ్.
నిజానికి, ఈ డిమాండ్‌తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి వుంటే బావుండేది. లేదంటే, జనసేన ముఖ్య నేతల్లో ఎవరైనా, ఈ నినాదంతో జనంలోకి వెళ్ళి వుంటే, అది ఇంకోలా వుండేది. కానీ, వీరమహిళలు ఎందుకు రంగంలోకి దిగినట్లు.? మంత్రుల్ని నిలదీయడం మానేసి, ఎమ్మెల్యేని అడ్డుకోవడమేంటి.?
కాగా, గతంలో జక్కంపూడి రాజా, జనసేన అధినేత మీద విపరీత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని టైమ్ చూసి, జనసేన వీర మహిళలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు, విజ్ఞాపన లేఖ ఇచ్చేందుకు వెళితే, ఎమ్మెల్యే అలాగే ఆయన అనుచరులు దుర్భాషలాడారన్నది జనసేన వీర మహిళలు చెబుతున్నమాట.
ఇంకోపక్క, జక్కంపూడి రాజా సంయమనంతో వ్యవహరించారనీ, విజ్ఞాపన పత్రాల్ని తీసుకునేందుకు ప్రయత్నించారనీ, జనసేన వీర మహిళలే నోటి మీద అదుపు కోల్పోయారనీ వైసీపీ అంటోంది. ఏది నిజం.?