రాజీనామా బాటలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.!

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి రాజీనామా చేయబోతున్నారా.? పార్టీలో ఇమడలేకపోతున్నాననీ, ఎదురవుతున్న అవమానాలు తట్టుకుని పార్టీలో వుండడం తన వల్ల కాదనీ ఆనం రాంనారాయణరెడ్డి చెబుతున్నారు సరే.. ఇంతకీ, ఆయన రాజీనామా చేసేదెప్పుడు.?

గత కొద్ది కాలంగా ఆనం రాంనారాయణరెడ్డి, సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తున్నారు. ‘ఇలాగైతే, జనం వద్దకు వెళ్ళి ఓట్లు అడిగేది ఎలా.? ఈ పద్ధతుల్లో ముందుకెళితే, గెలిచేది ఎలా.?’ అంటూ ఆ మధ్య ఆనం చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, పార్టీ అధిష్టానం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అప్పటినుంచి, క్రమంగా వైసీపీ శ్రేణులు ఆనం రాంనారాయణరెడ్డికి దూరమవుతూ వస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలు అస్సలు ఏమాత్రం ఆనం రాంనారాయణరెడ్డిని పట్టించుకోవడంలేదు. దాంతో, ఒంటరినయ్యాననే భావనలో వున్న ఆనం రాంనారాయణరెడ్డి, వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీడీపీతోపాటు జనసేనతోనూ ఆనం రాంనారాయణరెడ్డి టచ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం వుందంటూ, ఆనం అనుచరులు చెబుతున్నారు.

ఆనం వీడితే వచ్చే నష్టమెంత.? అన్న దిశగా వైసీపీ అధిష్టానం సమాలోచనలు చస్తోంది. పార్టీ నుంచి ఆనం బయటకు వెళ్ళేలోపు, ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగా పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి బయటకు పంపకుండా ఆనం రాంనారాయణరెడ్డిని ఎలా బయటకు పంపుతారు.? అన్న చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది.