ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, వైసీపీ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే వాదన బలంగా వినపడుతుంది. తగ్గట్టుగానే ఇంతకాలం రాష్ట్ర అధికార ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ నేతలు ఎలాంటి విమర్శలు చేస్తున్నా కౌంటర్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు వైసీపీ నేతలు. అలాంటిది ఇప్పుడు వైసీపీ పార్టీలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక బీజేపీతో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, బీజేపీ మీద మాటల యుద్ధం మొదలు పెట్టారు. తాజాగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ… నోటాతో పోటీ పడే పార్టీ బీజేపీ అంటూ పార్టీ గాలి పూర్తిగా తీసి పడేసారు. అంతే కాదు, కేంద్రంతో ఫిర్యాదు చేస్తే మాకు ఏమైనా భయమా, చేసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. మరి ఇది వెల్లంపల్లి సొంత అభిప్రాయమో, పార్టీ చెప్తే ఈ వ్యాఖ్యలు చేసారో కానీ, బీజేపీని ఒక ఆట ఆడేసుకున్నారు.
రెండు రోజులు క్రితం డీజీపీ పెట్టిన ప్రెస్ మీట్ లో, దేవాలయల పై జరిగిన ఘటనల విషయంలో, ఇద్దరు బీజేపీ నేతలు కూడా ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే. దీని పై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అసలు డీజీపీ అలా ఎలా చెప్తారు, సోషల్ మీడియాలో చెప్పినవి కేసు అంటారా, మా పైన ఆపాదిస్తారా ? డీజీపీ వైసీపీ పార్టీకి పని చేస్తున్నారు అంటూ, ఇలా డీజీపీ పై విరుచుకు పడ్డారు. అంతే కాదు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, ఇక డీజీపీ తమ పార్టీ పై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించకాపోతే పరువు నష్టం దావా వేస్తాం అంటూ హడావిడి చేసారు. అయితే సోము వీర్రాజు ఇలా వ్యాఖ్యలు చేసారో లేదో, మంత్రి వెల్లంపల్లి బయటకు వచ్చి సోము వీర్రాజు పై విరుచుకు పడ్డారు.
డీజీపీ పై అనవసరపు కామెంట్స్ చేస్తున్నారని, ఆయన దర్యాప్తులో వచ్చిన విషయాలు మీడియాకు చెప్పినా తప్పు అంటారా అని, ఆగహ్రం వ్యక్తం చేసారు. తమ తప్పు ఏమి లేకపోతే, బీజేపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. మా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి తెస్తున్న పధకాలను పక్కదోవ పట్టించేందుకే, బీజేపీ ఇలా మాట్లడుతుందని అన్నారు. తెలుగుదేశం హయాంలో ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం గుడిలు తొలగిస్తూంటే, అప్పటి బీజేపీ మంత్రి, బీజేపీ పార్టీ ఎందుకు చూస్తా కూర్చుందని ప్రశ్నించారు. సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి ఎక్కడకి వెళ్లారు అంటూ, ప్రశ్నించారు.
మా పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం అంటున్నారని, చేస్తే చేసుకోండని, కానీ అంతర్వేది ఘటనలో సిబిఐ విచారణకు ఇచ్చి ఇన్ని రోజులు అయినా, కేంద్రం ఎందుకు ముందుకు రావటం లేదో చెప్పాలని వెల్లంపల్లి అన్నారు. తిరుపతిలో గెలుపు మాదే అని, రెండో స్థానం కోసం మిగత పార్టీలు కొట్టుకోవాలని అన్నారు. నోటాతో పోటీ పడే పార్టీలు అంటూ బీజేపీని తీసి పడేసారు. ఇక బీజేపీ నేతలు ఎలా ఈ విమర్శలకి కౌంటర్ ఇస్తారో చూడాలి.