జేసీకి కొత్త సవాల్ విసిరిన హిందూపురం వైసీపీ నేత

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్ నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీకి రెండు సవాళ్లు కూడా విసిరారు శంకర్ నారాయణ. స్వార్ధ ప్రయోజనాలకోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఆయన జగన్ ని అమర్యాదగా సంబోదించడంపై శంకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు జేసీకి సవాల్ కూడా విసిరారు. ఆయన ఏం మాట్లాడారో పూర్తిగా తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ పూర్తిగా చదవండి.

ఎవరి పంచన చేరితే వారి భజన చేయడా మానుకోవాలని జేసీకి హితవు పలికారు హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకర్ నారాయణ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంలో పని చేసిన ఈయన, ఆ సమయంలో చంద్రబాబునాయుడుపై దుమ్మెత్తిపోశారు. ఈనాడు అదే చంద్రబాబును జేసీ కారణజన్ముడంటూ పొగడటం సిగ్గు చేటు అంటూ వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాల తన పొలిటికల్ కెరీర్ లో కనీసం మాట్లాడటం కూడా నేర్చుకొని జేసీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఓట్లేసి గెలిపించిన తాడిపత్రి ప్రజలే అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేసారు.

శంకర్ నారాయణ

ప్రతి వేదికపైన ప్రతిపక్ష నేత జగన్ ను అమర్యాదగా సంబోధిస్తూ…వయసులో చిన్నవాడు అయినందుకు అలా పిలుస్తున్నాను అంటూ సమర్ధించుకోవడం సరికాదని హితవు పలికారు. జేసీకి దమ్ముంటే లోకేష్ నో, లేదా టీడీపీ ఎమ్మెల్యేలనే అలా పిలవాలని ఛాలెంజ్ చేసారు శంకర్. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు హంద్రీ-నివా ప్రాజెక్టుకు ఎంతమేర ఖర్చులు చేసారు? వైఎస్ హయాంలో ఎన్ని నిధులు విడుదల అయ్యాయి? ఏ మేరకు పనులు పూర్తయ్యాయి అనే అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ జేసీకి మరో ఛాలెంజ్ విసిరారు శంకర్ నారాయణ.

హంద్రీ-నివా పనులు శరవేగంగా జరిగిన 2004-2009 లో వైఎస్ కాబినెట్ లో మంత్రిగా పని చేసిన జేసీ దివాకర్ రెడ్డి తన కొడుకుకి ఎంపీ టికెట్ ఇప్పించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. ఇలాంటి వైఖరితో ఇప్పటికే రాజకీయంగా నూకలు కోల్పోయారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే రెండు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇకనైనా జేసీ దివాకర్ రెడ్డి వయసుకు తగ్గట్లు ప్రవర్తించడం నేర్చుకోవాలని సూచించారు హిందూపూర్ పార్లమెంటు అధ్యక్షుడు శంకర్ నారాయణ.