నోరు జారి.. క్షమాపణ చెప్పి.! రెడ్డిగారూ అవసరమా ఇదంతా.?

ఆమె జనసేన పార్టీ అధికార ప్రతినిథి. ఆయన అధికార వైసీపీలో కీలక నేత. పైగా, చాలా డిబేట్లలో పాల్గొన్న వ్యక్తి. సీనియర్ పొలిటీషియన్ అని కూడా అనొచ్చు. వైసీపీ ప్రభుత్వంలో ఓ కీలక పదవిలోనూ వున్నారు. నామినేటెడ్ పదవే అయినా, క్యాబినెట్ ర్యాంక్ కూడా వుందట.! ఆమె ఎవరో కాదు కీర్తన. ఆయన ఎవరో కాదు రవిచంద్రారెడ్డి. ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత రవిచంద్రా రెడ్డి మాట మీద అదుపు కోల్పోయారు. జనసేన అధికార ప్రతినిథి కీర్తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మేకప్ వేసుకుని.. చీర మహిళలు.. పవన్ కళ్యాణ్‌ని ఇంప్రెస్ చేస్తే సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్సులొస్తాయ్.. ఇవీ రవిచంద్రారెడ్డి మాట్లాడిన మాటలు.

అంబటి రాంబాబు విషయంలో కీర్తన పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలు తక్కువేమీ కాదు. ఆ మాటలకు రవిచంద్రారెడ్డి కౌంటర్ ఎటాక్ ఇలా ఇచ్చారనుకోవాలి. అక్కడ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మహిళ మీద. దాంతో, సహజంగానే విషయం వివాదాస్పదమయ్యింది. కీర్తన నేరుగా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

జనసేన పార్టీ పెద్దలు కీర్తను అండగా నిలిచారు. న్యాయ పోరాటం చేయాలని సూచించారు. దాంతో, ఆమె ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈలోగా రవిచంద్రారెడ్డి తన తప్పు తెలుసుకున్నారు. రాజీకి వచ్చేశారు. తన వ్యాఖ్యల్ని తన భార్య కూడా సమర్థించలేదనీ, తాను సైతం అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గు పడుతున్నానని చెప్పారు రవిచంద్రారెడ్డి తాజాగా.

బేషరతు క్షమాపణ.. అదీ బహిరంగంగా చెబుతున్నాననీ, అవసరమైతే మిగతా ఛానళ్ళలోనూ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా వున్నాననీ, తన క్షమాపణల్ని అంగీకరించాలని రవిచంద్రారెడ్డి, కీర్తనను కోరారు. అందుకు ఆమె, క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు.

ఇకపై వ్యక్తిగత విమర్శలకు తావుండకూడదని ఆమె ఆకాంక్షించారు. అయితే, పార్టీ పెద్దలతో మాట్లాడి, తదుపరి ఏం చేయాలన్నదానిపై నిర్ణయం ప్రకటిస్తానని రవిచంద్రారెడ్డికి కీర్తన చెప్పారు.