ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరంలో తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది . గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వర్గ పోరుతో ఒక నేత ఆత్మహత్యాయత్నం చేసుకోవటం పెను సంచలంగా మారింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో వైకాపాలో ఏదో ఒక అలజడి చెలరేగుతూనేవుంది.
వల్లభనేని వంశీ రాకను స్థానిక వైకాపా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు, వంశీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వంశీపై జోజిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లు ఇద్దరూ కలిసి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. దళితులకు రావాల్సిన టెండర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని వల్లభనేని వంశీ నాశనం చేస్తున్నారని… వీరిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరి వైసీపీ నాయకత్వం దీనిని పట్టించుకుంటుందో లేదో చూడాలి.