ఎలాగైనా, రాజధాని అమరావతిలో యాభై వేల ఇళ్ళను కట్టేసి, దాన్నొక టౌన్‌షిప్‌గా చూపించాలన్న పట్టుదల వైసీపీ సర్కారులో స్పష్టంగా కనిపిస్తోంది. రాజధానికి సంబంధించిన ఆర్-5 జోన్‌లో ఇప్పటికే పేదలకు ఇళ్ళ పట్టాలు అందించింది వైసీపీ సర్కారు.
తాజాగా, ఈ భూముల్లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గతంలో ఇళ్ళ పట్టాలకు నడిచిన హంగామా.. తెలిసిందే. అంతకు మించిన హంగామా ఇప్పుడూ నడుస్తోంది.
వెయ్యికి పైగా బస్సుల్లో జనాన్ని (లబ్దిదారుల్ని.. సాధారణ ప్రజానీకాన్నీ, పార్టీ కార్యకర్తల్నీ) తరతలిస్తున్నారు.. ఈ శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం ఏర్పాటు చేసిన బహిరంగ సభ కోసం.
సరే, రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.! అయితే, రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాల విషయమై, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ప్రభుత్వానికి చిన్నపాటి వెసులుబాటు దొరికినా, తుది తీర్పుకి లోబడే.. పేదలకు ఇళ్ళు.. ఇళ్ళ స్థలాలు.. అనే అంశం వర్తిస్తుంది.
ఇంతటి సందిగ్ధావస్థలో.. శంకుస్థాపన దేనికి.? అంటే, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది తమకు రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుందని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు గనకనే. ఆరు నెలల్లోనే ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసేస్తామంటున్నారు.
జరిగితే మంచిదే.! కానీ, కోర్టు కేసుల వల్ల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తితేనో.! ప్రభుత్వానికి.. పార్టీకి జరిగే డ్యామేజీ ఓ రేంజ్‌లో వుంటుంది.