వైసిపి గెలుపులో పాదయాత్ర ప్రభావం

వైసిపి అఖండ విజయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ప్రభావం బాగా కనబడుతోంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ 134 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. అందులో వైసిపి 113 నియోజకవర్గాల్లో గెలిచింది. గెలిచిన నియోజకవర్గాల్లో కూడా చాలా వరకూ బంపర్ మెజారిటీతో గెలిచినవే ఉండటం గమనార్హం. అంటే పాదయాత్ర చేయటం జగన్ కు ఎంతగా లాభించిందో గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

తన పాదయాత్రను జగన్ కడప జిల్లాలోని ఇడుపులపాయతో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించారు. దాదాపు 3641 కిలోమీటర్ల పాదయాత్రలోనే చాలా వరకూ అభ్యర్ధులను కూడా జగన్ ఖరారు చేశారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో జనాల స్పందన ఏమిటో స్వయంగా  తెలుసుకున్నారు. మంచి ఫీడ్ బ్యాక్ ఉన్న అభ్యర్ధులకే టికెట్లిచ్చారు. ఫీడ్ బ్యాక్ సరిగా లేని అభ్యర్ధులను నిర్మొహమాటంగా మార్చేశారు.

అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నేపధ్యం, గెలుపు అవకాశాలు, సామాజికవర్గం లాంటి విషయాలను ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్ధిక విషయాలకు  జగన్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఆర్దికంగా బలహీనంగా ఉన్నా సరే మిగిలిన విషయాల్లో ఓకే అనుకుంటే టికెట్ ఇచ్చేశారు. అభ్యర్ధికి అవసరమైన డబ్బు విషయాలేవో జగనే చూసుకున్నారు.

అన్నీ జిల్లాల్లో పాదయాత్ర చేసినా అన్నీ నియోజకవర్గాలను మాత్రం టచ్ చేయలేదు. అయినా కానీ దాని ప్రభావంతో చాలా నియోజకవర్గాలు గెలిచింది వైసిపి. ఉభయగోదావరి జిల్లాల్లో 23 నియోజకవర్గాలు, రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులో 21, రాయలసీమ జిల్లాల్లో 30 నియోజకవర్గాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 14, ఉత్తారంధ్రలోని మూడు జిల్లాల్లో 25 నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది.