వైసీపీలో తుఫాన్: సలహాదారులే కోవర్టులు?

ప్రజల్లో బలం ఉన్న పార్టీలో నుండి వేరే పార్టీ లోకి వెళ్లాలని ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకోరు. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటూ… వెంటిలేటర్ పై ఉన్న పార్టీలో చేరి ఐసీయూలో బెడ్ షేర్ చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. కానీ.. ఏపీలో కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఆ పనే చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీని కాదని అంపశయ్యపై ఉన్న పార్టీతో అంటకాగుతున్నారు. అందుకు కారణం… వారంతా అమాయకులనో, రాజకీయ అజ్ఞానులనో కాదు. అధికారపార్టీలో అలాంటి ప్రత్యేక పరిస్థితులు తమకు ఎదురవ్వడమే! ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్.

అవును… ఇప్పుడు అధికార పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల్లో ఇదే భావన ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైసీపీ ముఖ్య సలహాదారుడు ఆ ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి సృష్టించాడట. అందులో సీనియర్ – జూనియర్ అనే తేడాలెవీ లేకుండా… వార్డ్ మెంబర్ కూడా కానీ ఆ సలహాదారుడు… మంత్రులుగా చేసినవారిపై కూడా తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఇబ్బందిపెడుతున్నాడంట.

ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో.. తన హయాంలో ఏవో కొన్ని గుర్తు ఉండిపోయే అభివృద్ధి పనులు చేయాలనే కోరిక ఉంటుంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలసి తమ కోరికలు చెప్పుకొని నిధులు కోరతారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినా గాని నిధులు మాత్రం విడుదల అవ్వకుండా ఆ సలహాదారుడు – ఇంకొక అధికారి కలసి, వాళ్ళు టార్గెట్ చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను అనేక రకాలుగా విసిగించి, చిరాకు పరుస్తారు, ఓర్పు సహనం కోల్పోయేలా చేస్తున్నారంట.

చంద్రబాబుకి నచ్చని మంత్రుల్లో కొందరైన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ తమ మంత్రి పదవి కోల్పోయారు. చంద్రబాబు మీద గట్టిగా మాట్లాడితే మంత్రి పదవి ఊడిపోతుంది అని సంకేతాలు బలంగా పంపారా? చంద్రబాబు కోసం వైకాపాలో పని చేస్తున్న సలహాదారులు… జగన్ కి తప్పుడు సమాచారం తప్పుదోవపట్టిస్తున్నారా? “అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయంగా నా వెనుక గట్టిగా నిలబడింది కొడాలి నాని అధ్యక్షా” అని చెప్పినా గాని నాని మంత్రి పదవి తొలగించటంలో ముఖ్యపాత్ర ఎవరు వహించారు? బలం లేకపోయినా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసేలా బాబుకు.. వైకాపాలోని ఇంటర్నల్ విషయాలు వెల్లడించింది ఎవరు?

ప్రస్తుతం వైకాలో ఈ ప్రశ్నలు, తదనుగుణంగా వస్తున్న సమాధానాలు… గతంలో జరిగిన సంఘటనలు – ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నేతలు లింక్ చేసి చూసుకుంటున్నారంట. దీంతో… ఇంతకాలం జగన్ కి సలహాలిస్తుంది.. చంద్రబాబు కోవర్టులా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయట. దీంతో… ప్రస్తుతం వైకాపాలో అంతర్లీనంగా పెద్ద తుఫానే చోటుచేసుకుందని.. అది ఏక్షణమైనా తీరం దాటొచ్చని.. అందులో సలహాదారుడిగా చెప్పబడుతున్న వ్యక్తులు కొట్టుకుపోతారాని అంటున్నారు విశ్లేషకులు! దీంతో… జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరుకుంటున్నారు అభిమానులు – కార్యకర్తలు!

ఇక్కడ గమనించాల్సిన అత్యంత ఆసక్తిగల విషయం ఏమిటంటే…. “2014 ఎన్నికల ముందు జగన్ జైల్లో ఉన్నప్పుడు దాదాపు 60 – 70 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో తప్పుడు సర్వే రిపోర్టులు ఇచ్చి ఒక సారి వెన్నుపోటు పొడవడంతో… ఇతన్ని పార్టీ దూరం పెట్టింది. దీంతో… 2019 లో మళ్ళీ అధికారంలోకి రాగానే చాకచక్యంగా చేరి, ముఖ్యమైన పదవిలోకి వచ్చి.. పార్టీ మీద తన పగ తీర్చుకుంటున్నాడొక వ్యక్తి” అంటూ నర్మగర్భ పోస్టులు ఆన్ లైన్ వేదికగా వెలుస్తున్నాయి!