మీసం తిప్పిన సీఐ గోరంట్ల మాధవ్ కి వైసీపీ బంపర్ ఆఫర్

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాయలసీమ వాతావరణం వేడెక్కనుందా? అనంతపురం రాజకీయాల్లో తిరుగులేని నేతగా చలామణి అవుతున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాక్ తగలనుందా? జేసీకి చెక్ పెట్టేందుకు మీసం తిప్పిన పోలీసు అధికారిని రంగంలోకి దింపనుందా? అసలు అనంతపురం వైసీపీ నేతలు వేస్తోన్న స్కెచ్ ఏమిటి? అనంతపురం వైసీపీలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు ఆంద్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మరి అనంత పాలిటిక్స్ గురించి తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ పూర్తిగా చదవండి.

అనంతపురం రాజకీయాల్లో జేసీ వర్గానికి ఒకరకమైన గుర్తింపు ఉంది. వీరు ఏం చేసినా సంచలనమే. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ జేసీ బ్రదర్స్. మరి ఇలాంటి వ్యక్తులపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందా అంటే 6 సార్లు తాడిపత్రి నుండి జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎలా గెలుపొందేవాడు? అనంతపూర్ ఎంపీగా ఎలా ఎన్నికయ్యేవాడు? గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 6 సార్లు ఎంపీగా గెలిచి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపు నుండి పోటీ చేసిన అనంత వెంకటరామిరెడ్డిపై టీడీపీ తరపు నుండి పోటీ చేసి గెలుపొందాడు జేసీ దివాకర్. విశేషమేమిటంటే ఇద్దరూ కాంగ్రెస్ నుండి పార్టీలు మారినవారే.

వైసీపీకి జేసీ కొరకరాని కొయ్యగా మారాడు అనేది వైసీపీ అంతర్గత చర్చ. అనంతపూర్ లో జేసీ హవానే కొనసాగుతోంది. నయానో భయానో ఎదురొచ్చినవాళ్ళని గమ్మున కూర్చోబెట్టే లక్షణం జేసీ ఫ్యామిలీది. అధికారులను సైతం లెక్క చేయకుండా నోటికొచ్చినట్టు దుర్భాషలాడతారు అనేది మీడియా ఎదుటే బయటపడింది. తాడిపత్రిలో ప్రబోధానందకి, జేసీ వర్గానికి మధ్యన జరిగిన పోరులో జేసీ దివాకర్ రెడ్డి పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ ఐంది.

 

ఆయన చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన పోలీసు అధికారుల సంఘం నాయకుడు, కదిరి సీఐ గోరంట్ల మాధవ్ మీసం మెలేసి నాలుక తెగ్గోస్తా అంటూ జేసీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు మెలిక. జేసీకి పబ్లిక్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈ పోలీసు అధికారికి వైసీపీ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నుండి ఆయన్ని పార్లమెంటు బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణుల్లో నడుస్తోన్న చర్చ.

ప్రస్తుతం హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా నదీమ్ వ్యవహరిస్తున్నారు.నదీమ్ ను అసెంబ్లీ స్థానానికి మార్చి ఆ స్థానంలో పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ని బరిలోకి దింపితే పార్టీకి అన్ని విధాలా మేలు జరుగుతుందనే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. సీఐ మాధవ్ బీసీ కురుబ సామజిక వర్గానికి చెందిన వ్యక్తికావడంతో బీసీల జిల్లాగా పేరున్న అనంతలో పార్టీకి ప్లస్ అవుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట నేతలు. పైగా అనంతపూర్ నగరానికి అతి దగ్గరగా ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవ్ కి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు, ఆయన డిమాండ్ కి మరో నియోజకవర్గ ఇంచార్జి కూడా మద్దతు తెలుపుతున్నారు అని పార్టీ అంతర్గతవర్గాల సమాచారం.

అయితే గోరంట్ల మాధవ్ కూడా ఎన్నికల్లో నిలబడటానికి ఆసక్తి చూపుతున్నారని, ఇందుకు పోలీసు వర్గాలు కూడా మద్దతుగా ఉన్నాయని తెలుస్తోంది. తాడిపత్రి ఘటన తర్వాత పోలీసు వర్గాల్లో కూడా జేసీపై వ్యతిరేకత బయటపడింది. ఈ నేపథ్యంలో తమ వర్గానికి చెందిన మాధవ్ రాజకీయాల్లో నిలబడటాన్ని వారు స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు, గోరంట్ల మాధవ్ మధ్య ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.

ఇక అనంతపూర్ ఎంపీ అభ్యర్థిని కూడా మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు పార్టీ శ్రేణుల మధ్య చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా మొదటి నుండి అనంత వెంకటరామిరెడ్డి ఉన్నారు. కాగా ఆయన ప్రస్తుతం అనంతపూర్ అసెంబ్లీ స్థానంపై దృష్టి పెట్టారు. దీంతో పార్లమెంటు స్థానంలో బోయ సామాజికవర్గానికి చెందిన పీడీ రంగయ్యను నిలబెట్టారు. అయితే ఇప్పుడు ఆ స్థానంలో కూడా మార్పులు చేపట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు టాక్. ఈ రెండు పార్లమెంటు స్థానాలపై మరి కొద్ది రోజుల్లో అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైసీపీ నేతలు.