యాదాద్రి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో వింత జరిగింది. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన సర్పంచ్ అభ్యర్ధి దంపతులు చివరకు తమ ఓటు తామే వేసుకోలేక పోయారు. దీంతో ప్రత్యర్ధి ఒక్క ఓటుతో విజయం సాధించారు. వారి ఓట్లు వారు వేసుకుంటే వారే ఒక ఓటు మెజార్టీతో గెలుపొందేవారు. దీంతో ఓడిపోయిన దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం రంగాపురంలో ఆగంరెడ్డి దంపతులు, ప్రభాకర్ రెడ్డి దంపతుల మధ్య టఫ్ పోటి నడిచింది. అయితే ఎన్నికల హడావుడిలో పడి ఆగంరెడ్డి దంపతులు తమ ఓటును వేయడం మరిచిపోయారు. దీంతో సాయంత్రం కౌంటింగ్ తర్వాత ఫలితాలలో ఆగంరెడ్డి దంపతులు ఒక్క ఓటుతో ఓటమిపాలయ్యారు. అప్పుడు కానీ వారికి గుర్తుకు రాలేదు తమ ఓటే తాము వేసుకోలేకపోయామని. అప్పుడు గ్రహించి లబోదిబోమన్నారు.
తమ ఓటు తాము వేసుకుంటే గెలిచేవాళ్లం కదా.. చేతులారా ఓడిపోయామని వారు కన్నీరు పెట్టారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యంలో ముంచింది. పోటి చేసే అభ్యర్ధులు ముందు ఓటు వేసి ఆ తర్వాత ప్రచారం చేయాలనే సందేశం ఈ సంఘటన ద్వారా తెలిసిందని అంతా చర్చించుకుంటున్నారు.