వైసీపీ ‘రివర్స్’ కేసులు పెడితే జనసేన పరిస్థితేంటి.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అనుకూల మీడియా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై జనసేన పార్టీ సీరియస్‌గా స్పందించింది. చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. జనసేన శ్రేణులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ దెబ్బతో వైసీపీ సోషల్ మీడియా విభాగం మటాష్.. అనే భ్రమల్లో వుంది జనసేన. వైసీపీ అనుకూల మీడియా కూడా ఈ బెదిరింపులకు దిగొస్తుందన్నది జనసేన భావన. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది.

ఎప్పుడైతే జనసేన ఫిర్యాదులు షురూ చేసిందో, ఆ తర్వాతి నుంచి సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేతపై ట్రోలింగ్ మరింత తీవ్రమైంది. ‘ప్రశ్నిస్తే తప్పేముంది.? మూడో భార్యతో కలిసే వున్నారా.? విడిపోయారా.? ఇది ప్రశ్న మాత్రమే. చేతనైతే సమాధానం చెప్పండి’ అంటూ వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు మరింత ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా వుంటే, వైసీపీ తరఫున కూడా జనసేన పార్టీ మీద ఫిర్యాదులు షురూ కాబోతున్నాయట. వైఎస్ జగన్ సతీమణి భారతి మీద అత్యంత అసభ్యకరమైన జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వేస్తుండడాన్ని వైసీపీ కూడా సీరియస్‌గా తీసుకుంది.

గతంలోనే, వైసీపీ నేత.. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, జనసేనతోపాటు టీడీపీకి కూడా అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక జనసేన ఫిర్యాదులు షురూ అయిన దరిమిలా, అట్నుంచి కౌంటర్ ఎటాక్ ఫిర్యాదులు కూడా షురూ కాబోతున్నాయి.వ్యవస్థలు అధికార పార్టీకి అనుకూలంగా వుంటాయన్నది బహిరంగ రహస్యం. ఆ లెక్కన, జనసేన పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఏమో.!