కడప జిల్లాలో వైఎస్సార్ పార్టీ ఆధిపత్యం కొనసాగేనా?

(యనమల నాగిరెడ్డి)

 

వైఎస్సార్ అధినేత జగన్ కు, ఆయన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కి కడప జిల్లా ప్రజలు 2004, 2009,2014 ఎన్నికలలో బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి ద్వారా జగన్ కు సంక్రమించిన ప్రజాభిమానాన్ని సొమ్ము చేసుకున్న వైఎస్సార్ పార్టీ శాసనసభ్యులు, నాయకులు తమ ప్రాంతాలలో జరిగే పెండ్లిళ్ళు, చావులు, కర్మలకు హాజరైతే చాలని, కార్యకర్తలను, ప్రజాసమస్యలను పట్టించుకోకున్నా పరవాలేదని, జగన్ పలుకుబడితో తాము గెలుస్తామన్నధీమా కనబడుతుంది. 2019 ఎన్నికలలోపు ఈ వ్యవహరశైలి మారకపోతే పార్టీకి చేదు అనుభవం మిగలక తప్పదన్నది చాలా మంది అభిప్రాయం.

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై. ఎస్. జగన్ స్వంత జిల్లా కడప. ఈ జిల్లాలో ప్రజలు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డికి 2004, 2009 ఎన్నికలలోనూ, 2014 ఎన్నికలలో జగన్ కు బ్రహ్మరథం పట్టారు.

2014 ఎన్నికలలో జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో 9 మందిని గెలిపించారు. అలాగే రెండు ఎం.పి. స్థానాలలో కూడా భారీ మెజారిటీ అందించారు.

ఆతర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాలు జగన్ కు, పార్టీకి అనేక చేదు అనుభవాలనే మిగిల్చాయి. కాగా జిల్లాలో పార్టీ టిక్కెట్ పై గెలిచిన ఇరువురు ఎం.ఎల్.ఎలు. టీడీపీ లో చేరడం, ఎం.ఎల్.సి ఎన్నికలలో జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి ఓడిపోవడం, అత్యంత నమ్మకస్తులుగా ఉన్న వ్యక్తులు మోసం చేయడం, ప్రజాసమస్యల పట్ల నాయకుల నిష్క్రియా పరత్వం, కార్యకర్తలను పట్టించుకోకపోడం లాంటి అంశాలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తున్నాయి.

జిల్లాలో గెలిచినవారు 9 మంది కాగా ప్రస్తుతం ఉన్న 7 మంది శాసనసభ్యులలో నలుగురి వ్యహారశైలిపై కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే నియజకవర్గ సమన్వయకర్తల మీదకూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాయకులు పార్టీ కార్యక్రమాలను కంటితుడుపుగా నిర్వహించడం, కార్యకర్తల ఫోన్లకుజవాబు చెప్పకపోవడం, నిజాలు చెప్పకపోవడం, వ్యక్తిగత, సామాజిక సమస్యల పట్ల సరిగా స్పందించకపోవడం లాంటి కారణాలు పార్టీ పరిస్థితిని దిగజరుస్తాన్నాయని వారు వాపోతున్నారు.

ఈ వరుసలో మొదటి స్థానం రాయచోటిది కాగా రెండవ స్థానంలో కమలాపురం ఉంది. అలాగే కోడూరు, ప్రోద్దటూరు, మైదుకూరు తర్వాత స్థానాలు ఆక్రమిస్తున్నాయి. ఆతర్వాత వరుసలో పులివెందుల ఉండగా, కడప ఎం.ఎల్.ఏ ఒకరు మాత్రం అసమ్మతిలో చివరి స్తానంలో ఉన్నారు.

రాయచోటి

జగన్ కు అతి సన్నిహితుడుగా పేరున్న రాయచోటి ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి అసమ్మతి సెగలు ఎదుర్కోవడంలో మెదటి స్థానంలో ఉండడం ఆశ్శర్యకరం. అనుయాయులకు నిజం చెప్పరని, ఆయన కు సంబంధించిన అంశాలలో తప్ప ఇతర అంశాలపై గట్టిగా పోరాడటానికి సిద్ధం కారని అనుచరులు వాపోతున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నా “మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటిని పరిష్కరిస్తామని” గట్టి హామీ ఇస్తారట. “జగన్ ఓట్లున్నాయి. నేను తప్పకుండా గెలుస్తా” అన్నది ఆయన ధీమా ఆట.

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ, ఎం.పి. సి.ఎం. రమేష్ లాంటి టీడీపీ నాయకులతోనూ ఆయనకు మంచి సంబందాలు ఉన్నాయని “రాజకీయ ఊగిసలాటకే” ప్రాధాన్యం ఇస్తారనేది ఆయనకున్న మరో అపవాదు.

గత ఎం.ఎల్.సి ఎన్నికల సందర్భంగా డబుల్ గేమ్ ఆడి వైఎస్సార్ అభ్యర్థి వివేకానంద రెడ్డిని ఓడించి తన గెలుపుకు సహకరించినందుకు టీడీపీ అభ్యర్థి బి.టెక్ రవి జడ్పీ సమావేశం లో బహిరంగంగా శ్రీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ అంశం అప్పట్లో పార్టీలో కలవరం కలిగించడంతో పాటు, శ్రీకాంత్ రెడ్డి ప్రతిష్టను మంట కలిపింది. దీనివల్ల ఆయనపై జగన్ కుటుంబ సభ్యలలో తీవ్ర అసంతృప్తి ఉందనేది పార్టీవర్గాల సమాచారం.

ఈ నియోజకవర్గంలో జగన్ పేరు చెప్పి ఎవరిని నిలిపినా గెలుపు ఖాయమని, అటువంటి సమయంలో మైనారిటీలకు టికెట్ కేటాయించాలని కొందరు, అభ్యర్థిని మార్చి కార్యకర్తలకు నిజాలు చెప్పి అండగా ఉండే వ్యక్తిని ఎంపిక చేయాలని కొందరు ఇటీవల నేరుగా జగన్ ను కలిసి కోరారట.

అయితే రాజంపేట మాజీ ఎం.పి. మిథున్ రెడ్డి అండదండలతో టికెట్ దక్కించుకోవడంతో పాటు గెలుపుకూడా తనదేనన్న ధీమాతో శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

కమలాపురం

ఇకపోతే “రాజుగారి బావమరిదిగా” గుర్తింపు పొందిన జగన్ మేనమామ, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్ర రెడ్డి అసమ్మతి సెగలలో చిక్కుకున్న రెండవ నాయకుడుగా ఉండటం విశేషం. కార్యకర్తలు ఏపని అడిగినా ” మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత” అన్నది ఆయన స్టాండర్డ్ జవాబట. ఫోన్లకు జవాబు ఇవ్వకపోవడం, నిజాలు చెప్పక పోవడం, మాటమీద నిలువక పోవడం, ఆర్థిక పరంగా జేబులో చేయి పెట్టక పోవడం లాంటి అవలక్షణాలే ఆయనకు అధికంగా ఉన్నాయని అంతేవాసుల ఆవేదన.

జగన్ కు మేనమామ కావడం, రాజశేఖర్ రెడ్డి శ్రీమతి, తన సోదరి విజయమ్మ ఆశీస్సులు పుష్కలంగాఉండటం వల్ల తనకే టికెట్ గ్యారెంటీ అని రవి రెడ్డి ధీమాగా ఉన్నారని కార్యకర్తలు అంటున్నారు. జగన్ పట్ల జనానికిఉన్న నమ్మకం, అభిమానమే ఈయనకు శ్రీరామ రక్ష అని అందువల్లనే రెడ్డి గారు ఎవరినీ పెద్దగా పట్టించుకోవడంలేదని వారు వాపోతున్నారు..

 

కోడూరు

ఎస్.సి.లకు కేటాయించిన కోడూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాసులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారని ఆ నియోజకవర్గ ప్రజల ఉవాచ. ఆయన కూడా నియోజకవర్గ సమస్యల పట్ల కానీ కార్యకర్తల సమస్యల పట్ల కానీ అంతంత మాత్రంగా స్పందిస్తారని, ఫోన్లు ఎత్తకపోవడం లాంటి లక్షణాలు ఉన్నాయని, కార్యకర్తలు వాపోతున్నారు. అందుబాటులో ఉండరనేది మరో ఆరోపణ. ఈ నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులున్నా, నియోజవర్గస్థాయిలో సమన్వయకర్త లేకపోడం పెద్ద లోటుగా ఉంది.శ్రీనివాసులు అందుబాటులో లేకపోవడంతో ఆయనపై మండిపడుతున్న ప్రజలు, కార్యకర్తలు రాజంపేట మాజీ ఎం.పి మిథున్ రెడ్డి పై అన్నింటికీ ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ప్రోద్దటూరు

ప్రోద్దటూరు ఎం.ఎల్.ఏ ప్రసాద్ రెడ్డి పైన కూడా కొంచెం ఇంచుమించు ఇలాంటి ఆరోపణ లే ఉన్నాయి. కార్యకర్తలకు కొంతమేరకు అందుబాటులో ఉన్నా, పార్టీ కార్యక్రమాలను పట్టణ ప్రాంతానికే పరిమితం చేస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పర్యటించరని, ఫోన్ల కు జవాబు ఉండ దన్నది కార్యకర్తల ఆరోపణ. ఎం.పి ఇచ్చిన 60 లక్షల నిధులను తన ఇంటిచుట్టు వినియోగించుకుని, ” ప్రోద్దటూరు నియోజకవర్గానికి బదులుగా రామేశ్వరం ( ఆయన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతం) ఎం.ఎల్.ఏ గా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.జగన్ కున్న ప్రజాకర్షణ, ఈ నియోజకవర్గ టీడీపీలో ఉన్న వైరుధ్యాలు మాత్రమే ఈయన బలం. అంటున్నారు జనం.

మైదుకూరు

సాత్వికుడుగా పేరుపొందిన రఘురామిరెడ్డి పై కూడా మొన్నటిదాకా ఇలాంటి ఆరోపణ లే ఉన్నాయి. అయితే ఇటీవల మేలుకొన్న ఆయన ఇటీవల కాలంలో జరిగిన కె.సి. కెనాల్ ఉద్యమంలో రైతుల పక్షాన ముందు నిలబడి పోరాడటం, వైఎస్సార్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలవడం లాంటి అంశాలు ఆయనపై ఉన్న అసంతృప్తిని తగ్గించాయని చెప్పవచ్చు. ఆయన ఇలాగే కొనసాగితే కార్యకర్తల పరంగా ఫిర్యాదులు ఉండకపోవచ్చు.

పులివెందుల

పులివెందుల నుంచి స్వయంగా వైఎస్సార్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తుండటం, పులివెందుల వచ్చినా కోటరీకే ప్రాధాన్యం ఇస్తూ, తనను కలవడానికి సాధారణ జనానికి అవకాశం ఇవ్వకపోవడం లాంటి అంశాలు ఆయనపై అసంతృప్తి కలిగిస్తున్నాయి. అయితే ఆయన 2019 ఎన్నికలలో గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడని తమను ఆదుకుంటాడని వారు ఆశిస్తున్నారు. దీనికి తోడు కడప మాజీ ఎం.పి. అవినాష్ రెడ్డి జగన్ లేని లోటు తీర్చడానికి ప్రయత్నించడం కూడా కొంతమేరకు ఫలితం ఇస్తున్నది. అయితే కృష్ణా జలాలను పులివెందుల తరలించడం ద్వారా టీడీపీ ఈ నియోజకవర్గంలో కొంత మేర తన పట్టు పెంచుకోగలిగింది. జగన్ కు గతంతో పోలిస్తే 2019లో మెజారిటీ తగ్గే అవకాశం కనిపిస్తున్నది.

కడప

అందరి సమ్మతి పొంది, అసమ్మతికి దూరంగా ఉన్న ఒకే ఒక శాసన సభ్యుడిగా కడప శాసనసభ్యుడు అంజాద్ బాషా నిలుస్తున్నారు. వివాదాలకు దూరంగా పార్టీలో అందరికీ అనుకూలంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలలో యధాశక్తి పనిచేస్తున్నాడనే వినిపిస్తుంది. మైనారిటీలకు పెట్టని కోటలా ఉన్న కడపలో 2019లో కూడా ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

జమ్ములమడుగు

వైఎస్సార్ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సుధీర్ రెడ్డి పనిచేస్తున్నారు. అనుభవలేమి అన్ని మండలాలలో సంబందాలు లేకపోవడం, కుటుంభపరంగా పూర్తి మద్దతు లేకపోవడం లాంటి కారణాల వల్ల ఆయన ఆశించిన మేరకు పట్టు సాధించలేకున్నారని చెప్పవచ్చు. అలాగే ఫ్యాక్షన్ తో రగిలిన ఈ నియోజకవర్గ ప్రజలలో నమ్మకం కలిగించడం అంటే సులభ సాధ్యం కాదు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ఈ నియోజకవర్గంలో వైస్సార్ గెలవడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

బద్వేలు

ఎస్.సి.లకు కేటాయించిన బద్వేలు నియోజకవర్గంలో కూడా వైఎస్సార్ టికెట్ పై గెలిచిన జయరాములు టీడీపీలో చేరడంతో వైస్సార్ పార్టీ అభ్యర్థి వేటలో పడింది. గోవింద రెడ్డి కనుసన్నలలో రాజకీయాలు నడిచే ఈ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ వెంకటసుబ్బయ్యను నియమించారు.

ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నా, గోవింద రెడ్డి దొరకడనేది ప్రజాభిప్రాయం. టీడీపీలో ఉన్న అంతర్గత తగాదాలు, జగన్ పై ఉన్న అభిమానంతో గట్టెక్కగలమనే నమ్మకంతో కార్యకర్తలున్నారు.

రాజంపేట

టీడీపీ గెలిచిన ఏకైక స్థానం రాజంపేట. ఇక్కడ మాజీ ఎం.ఎల్.ఏ అమరనాద రెడ్డి పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. వ్యక్తి గతంగా మంచి పేరున్న ఈయన అందరిని కలుపుకుని పోవడంలో విఫలం అయ్యారని, ముఖ్యలైన వారికే మాత్రమే అందుబాటులో ఉంటారనేది పార్టీ వర్గాల అభిప్రాయం. ఫోన్లకు జాబివ్వడనేది మరో ఆరోపణ. కార్యక్రమాలలో చురుకుగా ఉండటం కంటే కార్యక్రమాన్ని పూర్తి చేసామనడానికే ప్రాధాన్యమిస్తారట.మేడా వైస్సార్ పార్టీలో చేరితే ఈయన పంట పండినట్లే.

ఏది ఏమైనా జగన్ కు ప్రజలలో బలమైన మద్దతు ఉన్న కడప జిల్లాలో నాయకుల అలసత్వం కారణంగా పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయోమోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

నాయకులలో నెలకొన్న అతివిశ్వాసాన్ని, అహంకార ధోరణిని తగ్గించి, వారి అలసత్వాన్ని పారద్రోలాడానికి అధినేత వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.

మరి అధినేత తన దళపతులను ఎలా కార్యన్ముఖులను చేస్తారో, జిల్లాలో తన పార్టీ ఆధిపత్యాన్ని ఎలా నిలుపుకుంటారో వేచి చూడాల్సిందే.