పులివెందులలో రాజకీయాలు హీటెక్కుతున్నాయ్.! మామూలుగా అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పులివెందులలో రాజకీయంగా తిరుగు లేదు. ఆ మాటకొస్తే, కడపలో.. ఇంకా చెప్పాలంటే, రాయలసీమ వ్యాప్తంగా వైఎస్ జగన్‌కీ, వైసీపీకీ.. తిరుగులేని ‘పవర్’ వుంది.
సరే, నాలుగున్నరేళ్ళ పాలన తర్వాత సీమలో ఈక్వేషన్స్ తారుమారయ్యాయా.? అంటే, అది వేరే చర్చ. కానీ, కడప జిల్లాలో.. అందునా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఢీ కొట్టడం అనేది ఎవరికైనా అసాధ్యమే.!
అందుకే, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ షర్మిలను పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పోటీగా నిలబెట్టబోతోందిట. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్న వైఎస్ షర్మిల, వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల గురించి కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చించబోతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకు రాజకీయంగా అందుబాటులో వుంటానని వైఎస్ షర్మిల చెబుతున్నా, తెలంగాణలో దుకాణం సర్దేసి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆమె ఫోకస్ పెట్టినట్లే తెలుస్తోంది. కుమారుడు రాజా రెడ్డి పెళ్ళికి సంబంధించి, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రిక అందజేయనుండడం మరో ఆసక్తికర పరిణామం.
ఇదిలా వుంటే, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే, తానూ కాంగ్రెస్‌లో చేరతానని తాజాగా ఇంకోసారి ప్రకటించేశారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఇటీవల ఆయన వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాటలో మరికొందరు వైసీపీ ప్రజా ప్రతినిథులునన్నారంటే, వైఎస్ షర్మిల సన్నిహితులు మీడియాకి లీకులు పంపుతున్నారు. ఇంతకీ, పులివెందుల నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలెంత.?
గతంలో అయితే, వైఎస్ విజయమ్మకు పోటీగా కాంగ్రెస్ తరఫున వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు.