ఇలాగైతే వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేదెలా.?

పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు అత్యంత కీలకమైన వ్యవహారం. పోలవరం జాతీయ ప్రాజెక్టే గనుక, కేంద్రమే పూర్తిగా పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలి. అయితే, జాతీయ ప్రాజెక్టు తాలూకు నిర్వచనాన్ని కేంద్రం విస్మరించినట్లు కనిపిస్తోంది. 2014 నాటి అంచనాల ప్రకారమే నిధులు విడుదల చేస్తామని కేంద్రం చెబుతోంది. అదెలా సాధ్యమవుతుంది.? గడచిన ఏడేళ్ళలో చాలా ఖర్చులు పెరిగిన దరిమిలా, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా గణనీయంగా పెరిగిపోయింది. వాటిల్లో ముంపు ప్రాంతాల పునరావాసానికే అత్యధికం ఖర్చు చేయాల్సి వుంటుంది. ఈ విషయం కేంద్రానికి తెలియదని ఎలా అనుకోగలం.? కేంద్రం, పార్లమెంటు సాక్షిగా పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై పెదవి విరిచిన నేపథ్యంలో, అదనపు ఖర్చు భరించేది లేదని కుండబద్దలుగొట్టేసిన నేపథ్యంలో రెండేళ్ళుగా వైఎస్ జగన్ సర్కార్, కేంద్రంపై తెస్తున్న ఒత్తిడి వల్ల ప్రయోజనం లేదని తేలిపోయింది. మరెలా.? రాష్ట్రం, పోలవరం ప్రాజెక్టు ఖర్చుని భరించే పరిస్థితుల్లో లేదు.

అలాగని, పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఆపేయడం కుదరదు. వైఎస్ జగన్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించెయ్యడమే. కానీ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టు అది. దాంతో, ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్రంపై న్యాయపోరాటం చేస్తారా.? వేరే మార్గంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తారా.? అన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాల వల్లే ఇలా జరిగిందని రాజకీయ విమర్శలు చేయడం వైసీపీకి అంత మంచిది కాదు. ఎందుకంటే, ప్రాజెక్టు కోసం సరిగ్గా పనిచేస్తే.. వీలైనంత త్వరగా ఫలాలు అందుతాయి.. అందులో రాజకీయ ఫలాలూ వుంటాయి. సో, పోలవరం ప్రాజెక్టు విషయమై వైఎస్ జగన్ అన్ని కోణాల్లోనూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది.