రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ.. అన్నగారు ఎన్టీఆర్ 97 వ జయంతిని జరుపుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తన అసాధారణ నట ప్రతిభ, ఎమోషన్, భావ వ్యక్తీకరణ సహా మహదాద్భుత డైలాగ్ డెలివరీతో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకున్నాడు. రాముడు, శ్రీకృష్ణుడు, లేదా దుర్యోధనుడు, రావణుడు వంటి విలన్ పాత్రలను చేయడంలో ఆయనకు సరిలేరు ఎవ్వరూ! తారక రాముని కాలి గోటికి సరిపోరు వేరొకరు అనిపించారు.
తారక రాముడు తన సాహసోపేత వైఖరితో టీడీపీ పార్టీని ప్రారంభించి రాజకీయాల్లోకి దూసుకెళ్లాడు. కేవలం 9 నెలల్లోనే సర్వశక్తిమంతమైన జాతీయ కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీని తెలుగు రాష్ట్రం నుండి వేరు చేసిన మేరునగధీరుడయ్యాడు. తెలుగు ప్రజలకు `ఆంధ్రుల ఆత్మ గౌరవం` నినాదాన్ని పరిచయం చేయడమే గాక.. దాని ప్రాముఖ్యతను జనాల్లోకి తీసుకెళ్లగలిగిన గొప్ప నాయకుడు అయ్యారు.దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ రాజకీయ ఇమేజ్ అమాంతం పెంచింది ఈ పాయింటే. ఒకానొక సమయంలో ఆయనకు ప్రధాని పదవి వరించింది.
అయితే ఎన్‌టిఆర్ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని దానిని తృణప్రాయంగా త్యజించారు. లక్ష్మి పార్వతితో రెండవ వివాహం తరువాత ఎన్టీఆర్ అల్లుడు చంద్ర బాబు నాయుడు ..ఇతర కుటుంబ సభ్యులు చేసిన కుట్రలు ఎప్పటికీ హాట్ టాపిక్. ఎన్టీఆర్ రాజకీయ ఎదుగుదలను కుటుంబ సభ్యులే దిగజార్చారు. చంద్ర బాబు నాయుడు కాలక్రమంలో ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపివేయడంతో ఇప్పుడు టీడీపీ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితులలో, తన తాత ఎన్టీఆర్ రూపంతో పాటు అన్ని గొప్ప క్వాలిటీస్ ని వారసత్వంగా పొందిన ఏకైక వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కలలను సాకారం చేస్తాడా అనేది ప్రశ్నగా మిగిలింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత ఎన్.టి.ఆర్ పోలికను కలిగి ఉండడమే కాదు.. అంతే శక్తివంతమైన డైలాగ్ డెలివరీ .. నటప్రతిభ, వ్యక్తీకరణ సామర్థ్యం.. భావోద్వేగాలను కూడా కలిగి ఉన్నాడు. అతను సినీ పరిశ్రమలో తన నుండి నందమూరి అభిమానులు ఆశించిన దాన్ని సాధించాడు. కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అతను తన తాత ఎన్.టి.ఆర్ ను తలచేలా రాజకీయాల్లో గర్వించేలా చేసేది ఎపుడు? ఎన్టీఆర్ రాజకీయారంగేట్రం ఎప్పుడు ఉంటుంది? అన్నది ఇప్పటికి సస్పెన్స్. తన తాతగారి ఏలుబడి రోజులు వేరు. ఇప్పటి పరిణామాలు వేరు. ఎన్టీఆర్ తన రాజకీయ ఆకాంక్షలను సాధించాలంటే కుటుంబం నుంచే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే బయటి వైపు శత్రువులతోనూ అంతే పోరాడాలి. తన తాత రాజకీయాల్లో సాధించిన దానిలో సగం సాధించినా గొప్పనే.
ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే.. రాజకీయం తారక్ కి మైళ్ళ దూరంలో ఉంది. మెగా స్టార్ చిరంజీవి .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి చాలా మంది అగ్ర తారలు విఫలమైన ఈ రంగంలో తారక్ సిసలైన సంచలనం అవుతాడా? అన్నది చూడాలి.