విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తారా?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కుప్పంలో దెబ్బ కొట్టాలని అధికార వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికే యువకుడైన భరత్ అనే వ్యక్తిని రంగంలోకి దించింది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా వున్నారు. కుప్పంలో గెలిస్తే, ఎమ్మెల్యే అవడమే కాదు, ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కతుుంది. వైఎస్ జగన్ ఈ మేరకు భరత్‌కీ, కుప్పం నియోజకవర్గానికీ హామీ ఇచ్చారు.

మరి, మధ్యలో సినీ నటుడు విశాల్ పేరు ఎందుకు తెరపైకొస్తోంది కుప్పం వైసీపీ అభ్యర్థిగా.? ఈ విషయమై కుప్పం వైసీపీ వర్గాల్లోనూ కొంత అలజడి రేగింది. విశాల్ తెలుగువాడే అయినా, తమిళ సినిమాలతో పాపులర్ అయ్యాడు. అక్కడే వుంటాడు కూడా. స్ట్రెయిట్‌గా తెలుగు సినిమా చేసింది లేదు. తెలుగు రాజకీయాలతో ఆయనకు నేరుగా సంబంధాల్లేవు. తమిళనాట మాత్రం రాజకీయాలు చేస్తాడు.. సినీ రంగంలోనూ రాజకీయాల్లోనూ.. విశాల్ ఒకింత యాక్టివ్‌గానే వుంటాడు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు ఇష్టమనీ, ఏపీలో ఓటు గనుక తనకు వుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే వేస్తాననీ విశాల్ చెప్పాడు. ఇదంతా తన తాజా చిత్రం ‘లాఠీ’ సినిమా ప్రమోషన్లలో భాగమైన వ్యవహారమే అనుకోవాలేమో. అయితే, ఆ విశాల్ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా. విశాల్ ‘లాఠీ’ సక్సెస్ అవ్వాలనీ కోరుకుంటున్నారామె.

ఎలా చూసినా, విశాల్ వ్యవహారం కొంత ఇంట్రెస్టింగ్‌గానే కనిపిస్తోంది. అయితే, తనకు తెలుగునాట రాజకీయాలపై ఆసక్తి లేదనీ, ఏ రాజకీయ పార్టీ నుంచీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడంలేదనీ విశాల్ చెప్పేశాడు.

అయితే, రెడ్డి సామాజిక వర్గం కావడం, తమిళనాడు సరిహద్దులో వున్న ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం వుండడం, సినిమా గ్లామర్.. ఇలా చాలా లెక్కలేసుకుని, విశాల్‌ని ఏపీ రాజకీయాల్లోకి వైసీపీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ వుండదు. ‘ఐ లవ్ వైఎస్ జగన్’ అని విశాల్ అన్నారంటే, ఉత్తనే అనేసి వుంటారని ఎలా అనుకోగలం.?