విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి వైసీపీలో ముసలం బయల్దేరింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడికీ, అదే పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుడికీ మధ్య ‘భూ రచ్చ’ జరుగుతోంది.
విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా దసపల్లా భూముల్ని కొట్టేశారని ఎంవీవీ సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ చిత్ర విచిత్రమైన షరతులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భముల్ని తన వశం చేసుకుంటున్నారన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ.
అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇలా రచ్చకెక్కడం విశాఖ వైసీపీ నేతల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు వైసీపీ అంటే విజయసాయిరెడ్డి మాత్రమే. ఆ తర్వాత ఆయన బాధ్యతలు ఉత్తరాంధ్రకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర మీద కూడా విజయసాయిరెడ్డికి పెత్తనం లేదు. వైవీ సుబ్బారెడ్డి ఆశీస్సులతో ఎంవీవీ సత్యనారాయణ తన వ్యవహారాలు చక్కబెట్టుకోవడం విజయసాయిరెడ్డికి మింగుడు పడ్డంలేదు.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ఎంవీవీ సత్యనారాయణ ముచ్చటించారు. ఈ సందర్భంగా, ‘ఆయన కొత్తగా మీడియా సంస్థ పెడతానంటున్నారు.. కొత్తగా రాజకీయ పార్టీ కూడా పెతానంటారేమో..’ అంటూ ఎంవీవీ వ్యాఖ్యానించడం వైసీపీలో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది.
రామోజీరావు ‘ఈనాడు’కి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి కొత్త మీడియా సంస్థను ప్రారంభిస్తానని చెప్పిన మాట వాస్తవం. అయితే, ఇక్కడే చాలామందికి చాలా అనుమానాలొచ్చాయి. సాక్షి వుండగా వైసీపీ తరఫున ఇంకో మీడియా సంస్థ అయితే అవసరం లేదు. ‘సాక్షిలో ఈనాడుకి గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం..’ అని విజయసాయి వ్యాఖ్యానించడమూ పలు అనుమానాలకు కారణమయ్యింది.
ఇప్పుడేమో, విజయసాయి కొత్త పార్టీ పెడతారేమోనని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెటకారం చేయంతో, నిప్పు లేకుండా పొగ రాదు కదా.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో.. అందునా వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది.