ఢీ అంటే ఢీ.. అంటున్నారు అన్నయ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో చెల్లెలు వైఎస్ షర్మిల.! ‘కుటుంబంలో చిచ్చు’ అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల ఇప్పటికే కౌంటర్ ఎటాక్ గట్టిగానే ఇచ్చారు.
ఇదిలా వుంటే, వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల, కడప లోక్ సభ నియోజకవర్గానికి లేదా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికీ పోటీ చేసే అవకాశం వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా, కాంగ్రెస్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్న వైఎస్ షర్మిల, వచ్చే ఎన్నికల్లో నిజంగానే పోటీ చేస్తారా.? తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి, సరిగ్గా ఎన్నికల ముందర చేతులెత్తేశారు వైఎస్ షర్మిల. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వైఎస్ షర్మిల ఎన్నికల బరిలోకి దిగేంత రిస్క్ చేయకపోవచ్చు.
కానీ, కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేరే వున్నాయ్. పులివెందుల లేదా కడపలో వైఎస్ షర్మిలతో పోటీ చేయిస్తే, ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం వుంటుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందిట.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ పాతిక నుంచి ముప్ఫయ్ మంది వరకు ముఖ్యమైన నేతలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎలాగూ ఎన్నికల బరిలో వుంటారనుకోండి.. అది వేరే సంగతి.
కాంగ్రెస్ పార్టీకి నిథుల కొరత వుండదు. అది జాతీయ పార్టీ. సో, వచ్చే ఎన్నికల్లో ఒకట్రెండు చోట్ల గెలిచే అవకాశం వున్నా గట్టిగానే ఖర్చు చేయొచ్చు. వైఎస్ షర్మిలకి ఈ విషయంలో కూడా కాంగ్రెస్ అధినాయకత్వం గట్టి భరోసానే ఇచ్చినట్లు తెలుస్తోంది.
లోక్ సభ అలాగే అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా షర్మిల పోటీ చేసే అవకాశం వుందట. ఒకటి రాయలసీమ, ఇంకోటి ఉత్తరాంధ్ర.. అని అంటున్నారు.